Thudarum: చేతులెత్తేసిన దర్శక నిర్మాతలు
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:33 PM
'తుడరుమ్' మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా... మేకర్స్ దానిని పట్టించుకోకపోవడంతో టాక్ కు తగ్గ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమైంది.
మలయాళ సీనియర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయినా మోహన్ లాల్ తో సినిమాలు నిర్మించే మలయాళ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాలు తీయడానికి వెనకా, ముందు ఆడుతున్నారు. మలయాళంలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు డబ్ చేస్తే ఆడతాయో లేదో అని సంశయిస్తున్నారు. నిజానికి మోహన్ లాల్ ఎంపికచేసుకునే కథలు యూనిక్ గా ఉంటాయి. దాంతో ఎక్కడి ప్రేక్షకులైనా ఆ యా కథాంశాలతో కనెక్ట్ అయిపోతుంటారు. ఈ మధ్యవచ్చిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) కాంట్రవర్శీ కారణంగా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే తాజాగా విడుదలైన'తుడరుమ్' (Thudarum) మూవీకి ఇక్కడ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
'తుడరుమ్' సినిమాను మలయాళంతో పాటు తెలుగులో డబ్ చేసి మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే వారు చేసిన తప్పు ఏమిటంటే... ఈ సినిమాకు తెలుగు పేరు పెట్టకపోవడం. 'తుడరుమ్' అనేది మలయాళ పదం. దాని అర్థం తెలుగులో 'సశేషం' అని. కనీసం ఆ పేరును సినిమాకు పెట్టి ఉంటే... రిజల్ట్ మరోలా ఉండేది. 'తుడరుమ్' అనే పేరు జనాలకు ఎక్కలేదు. పైగా అర్థం కూడా సులువుగా తెలిసేది కాదు. తెలుగులో డబ్ చేసిన వారు దీనిపై శ్రద్థ పెట్టి ఉంటే రిజల్ట్ ఇంకాస్తంత ఆశాజనకంగా ఉండేది. అలానే ఈ సినిమాను తమిళంలో విడుదల చేయలేదు. అక్కడ కూడా మోహన్ లాల్ కు బాగానే అభిమానులు ఉన్నారు. ఆ భాషలోనూ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే... 'ఎల్ 2: ఎంపురాన్' తరహాలోనే 'తుడరుమ్' మూవీకీ మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో పోల్చితే దీనిలో వయొలెన్స్ తక్కువ. మోహన్ లాల్ కు పాత్రోచితంగా యాక్షన్ పెట్టినా... అది జస్టిఫై చేసేలానే ఉంది. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం 'తుడరుమ్' చూడటానికి ఆసక్తి చూపారు. చాలా కాలం తర్వాత మోహన్ లాల్ సరసన శోభన (Sobhana) నటించడం కూడా ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకుంటున్నారు. అలానే 'తుడరుమ్'ను గతంలో మోహన్ లాల్ చేసిన 'దృశ్యం'తోనూ కొందరు పోల్చుతున్నారు. ఈ సినిమాకు ఇంత పాజిటివ్ టాక్ వచ్చినా.... దర్శకుడు తరుణ మూర్తి కానీ నిర్మాత రంజిత్ గానీ ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ చేయలేదని తెలుస్తోంది. చక్కని ఓపెనింగ్స్ సాధించిన 'తుడరుమ్' యాభై కోట్లను దాటి వంద కోట్ల గ్రాస్ దిశగా సాగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే రూ. 150 వరకూ వసూలు చేయవచ్చని అంటున్నారు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాకు పబ్లిసిటీ కూడా తోడై ఉంటే.... కలెక్షన్స్ పరంగా మరింత మెరుగైనా ఫలితాన్ని ఇచ్చి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం!!