Vijay: రాజకీయాల్లో విజయ్ కొత్త రూటు!
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:50 PM
కోలీవుడ్ బాక్సాఫీస్ రారాజు, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం దళపతి విజయ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
కోలీవుడ్ (kollywood)బాక్సాఫీస్ రారాజు, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం దళపతి విజయ్ (vijay) గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. సినిమాలు హిట్టా, ఫట్టా అనే సంబంధం లేకుండా వందల కోట్ల కలెక్షన్లు రాబట్టడం ఒక్క దళపతికే సాధ్యం. ఇటీవల వచ్చిన గోట్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా, ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన స్టామినా ఏంటో నిరూపించింది. అయితే, ఇప్పుడు విజయ్ అభిమానులకు ఒకవైపు ఆనందం, మరోవైపు తీరని వేదన కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. విజయ్ తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలకబోతున్నారు.
వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న జననాయగన్ ఆయన కెరీర్‌లో ఆఖరి సినిమా కానుంది. ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఒక ఎమోషనల్ జర్నీలా సాగింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లుగా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న మీకు నేను రుణపడి ఉంటాను అంటూ ఆయన చేసిన ప్రసంగం అందరినీ కదిలించింది.
నా కోసం ఎంతో మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారు, నన్ను ఆదరించారు. ఇన్నాళ్లు నాకు సపోర్ట్ చేసిన మీ కోసం, నా ప్రజల కోసం మరో 30 ఏళ్లు నిలబడతాను. ప్రజలకు సేవ చేయడం కోసమే నేను సినిమాలను వదిలిపెడుతున్నాను అని విజయ్ ప్రకటించారు. జనాల కోసం చేసే ఈ పోరాటంలో జననాయగన్ తన చివరి చిత్రమని ఆయన స్పష్టం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాకపోయినా, ఇంత త్వరగా సినిమాలకు గుడ్ బై చెబుతారని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ ఈ విషయం ముందే తెలిసి ఉంటే, ఆయనతో భారీ కాంబినేషన్లు సెట్ చేయాలని భావించిన ఎంతోమంది మేకర్స్‌కు ఒక స్పష్టత ఉండేది.
కానీ, దళపతి రూటే వేరు. ఆలోచన రావడమే ఆలస్యం, ప్రజల కోసం తన అద్భుతమైన కెరీర్‌ను త్యాగం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను వెండితెరపై మళ్లీ చూడలేమనే బాధ ఉన్నప్పటికీ, ఆయన రియల్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నారు. రీల్ లైఫ్‌లో అన్యాయాన్ని ఎదిరించిన దళపతి, ఇప్పుడు రియల్ లైఫ్‌లో జన నాయకుడిగా మారబోతున్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు ప్రజల పక్షాన పోరాడతానని ఆయన ఇచ్చిన మాట అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి, విజయ్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు..? జననాయగన్ సినిమా కొత్త రికార్డులను తిరగరాస్తుందా అనేది చూడాలి..