Thalapathy Vijay:17న కరూర్ పర్యటనకు.. విజయ్
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:22 AM
టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈ నెల 17న కరూర్ (Karur) పర్యటనకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ( Thalapathy Vijay) ఈ నెల 17న కరూర్ (Karur) పర్యటనకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కరూర్ జిల్లా ఎస్పీ అనుమతిస్తే ఆయన తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాలని భావిస్తున్నారు. సెప్టెంబరు 27వ తేదీన విజయ్ కరూర్లో జరిపిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
అలాగే, తమ పార్టీ తరపున విజయ్ ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలావుండగా ఈ నెల 3, 4వ తేదీల్లో స్థానిక నేతలు కుటుంబాలను పరామర్శించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కరూర్ వెళ్ళేందుకు అనుమతివ్వా అని విజయ్ డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అయితే, కరూర్ ఎస్పీని సంప్రదించి టూర్ షెడ్యూల్ వివరాలు స్పష్టంగా వివరించి అనుమతి పొందాలని డీజీపీ కార్యాలయం సూచించింది. దీంతో శనివారం ఆ జిల్లాకు చెందిన టీవీకే నేతలు జిల్లా ఎస్పీని కలిసి ఈ నెల 17న విజయ్ పర్యటనకు అనుమతివ్వాలని కోరారు. అయితే, జిల్లా ఎస్పీ నుంచి ఇప్పటివరకు అనుమతి రాలేదు.
దీంతో సోమవారం కూడా మరోమారు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేయాలని టీవీకే నేతలు భావిస్తు న్నారు. అంతేగాక విజయ్ పర్యటనకు సంబంధించి అట్లాస్ ఆడిటోరియంను ఎంపిక చేసినట్టు సమా చారం. ఈ ఆడిటోరియానికి కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే, ఈ కార్యక్రమం జరిగే ఆడిటోరియం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని టీవీకే నేతలు సమర్పించిన వినతి పత్రంలో కోరారు..
విజయ్ అనుచరుడి విచారణ
ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విజయ్కు ప్రధాన అనుచరుడైన సేలం (సెంట్రల్) జిల్లా కార్యదర్శి పార్తిబన్ వద్ద ప్రత్యేక దర్యాప్తు ఆదివారం విచారణ జరిపింది ముందుగా అందిన సమన్లతో ఆయన ఆదివారం నలుగురు విచారణ అధికారుల ఎదుట హాజరయ్యారు. తర్వాత సౌండ్ ఇంజనీర్, జనరేటర్ ఆపరేటర్లను కూడా విచారణ జరిపారు. వీరితో పాటు ఆటవీ, ప్రజాపనులు, రహదారులు, రవాణా శాఖ అధికారుల వద్ద కూడా దర్యాప్తు అధికారులు విచారణ జరిపారు.
సీబీఐ విచాణపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పనుంది. సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ఐదు పిటిషన్లపై శుక్రవారం విచా రణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సోమవారం వెలువరించనుంది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.