Thalapathy Vijay: తెరపైకి.. విజయ్ రోల్ రాయిస్ కారు వివాదం! నాటి ఇష్యూ.. నేడు ట్రోలింగ్!
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:25 AM
తమిళ స్టార్ హీరో విజయ్ 2012లో రోల్స్ రాయిస్ కారుపై ఎంట్రీ ట్యాక్స్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
మనం అప్పుడెప్పుడో చేసిన పనులకు ఫలితాలు మరెప్పుడో వచ్చి ఒక్కోసారి అశ్చర్య పరుస్తాయి లేదా తీవ్ర సమస్యల్లోకి నెట్టుతాయి. గతంలో అంటే సోషల్ మీడియా ప్రభావం లేదు కాబట్టి అ ఇష్యూ కొద్దిలోనే సమిసిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. చీమ చిటుక్కుమన్న అంతర్జాతీయ స్థాయిలో సమస్య వెలుగులోకి రావడం సంబంధిత వ్యక్తిని పోతే దొరకడు అనేలా ట్రోల్ చేసే పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది అంతకుమించి అనే రేంజ్‌లో ఉంటుంది. సరిగ్గా అలాంటి ఓ వ్యవహారమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తుంది.
విషయానికి వస్తే.. 2012లో తమిళ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ (Rolls Royce) కారును దిగుమతి చేసుకున్నాడు. అయితే దానికి అదనంగా భారత ప్రభుత్వానికి ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సి రావడంతో విజయ్ దానిని మినహాయించాలని కొరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్రాసు హైకోర్టు (Madras High Court) జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం అతని పిటిషన్‌ను కొట్టివేయడమే కాక ఓ సెలబ్రిటీ అయి ఉండి, హీరోగా సినిమాల్లో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చే మీరు ట్యాక్స్ లో మినహాయింపు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం టాక్స్‌తో పాటు జరిమానాగా తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి రూ.1 లక్ష చెల్లించాలని కూడా ఆదేశించారు.
అయితే.. నాడు న్యాయమూర్తి వ్యాఖ్యలతో కలత చెందిన విజయ్ ఆ వ్యాఖ్యలను తొలగించాలని, జరిమానాను కూడా రద్దు చేయాలని 2021 అక్టోబర్‌లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ విజయ్ తరపు న్యాయవాది విజయ్ నారాయణ్ మాట్లాడుతూ.. నటుడు విజయ్ పన్ను చెల్లింపును ఎగవేసేందుకు ప్రయత్నించలేదని, పన్ను విధించడాన్ని సవాలు చేయడానికి తన రాజ్యాంగ హక్కును ఉపయోగించుకున్నారని పిటీషన్ సమర్పించారు. ననాడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల వల్ల విజయ్‌ను అంతా జాతి వ్యేతిరేకుడిగా చిత్రీకరించి చూపించారని అన్నారు.
దాంతో 2022న నటుడి అప్పీల్‌ను విచారించిన జస్టిస్ పుష్ప సత్యనారాయణ, జస్టిస్ మహ్మద్ షఫీక్‌లతో కూడిన ధర్మాసనం రోల్స్ రాయిస్ పన్ను కేసులో నాడు జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం నటుడు విజయ్ పై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగించాలని తీర్పునిచ్చి ఆ వ్యాఖ్యలను కొట్టివేసింది. ఆపై విజయ్ తన కారుపై మొత్తం ఎంట్రీ టాక్స్ రూ. 32 లక్షలు చెల్లించడంతో వివాదానికి ఎండ్ పడింది. అయితే ఇప్పుడు ఈ వివాదమే మరోసారి తెరపైకి వచ్చి అంతటా చర్చనీయాంశం అవుతుంది.
అప్పుడెప్పుడో 2012లో ఈ ఘటన జరగడం, ఆపై 2021లో ఇష్యూను ముగిసిపోగా ఇటీవల నాటి పేపర్ క్లిప్స్, ఇతర వార్తలను, వీడియోలను విరివిగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి రావడం, చురుగ్గా ప్రజల్లోకి వెళుతుండడంతో ప్రతిపక్షాలు ఇప్పుడు ఆ పాత అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చి నానా రాద్దాంతం చేస్తున్నాయి. దీంతో ఈ ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది. ఇప్పటికే కరూర్ తొక్కిసలాట ఘటన ఓ వైపు మరిచిపోని విధంగా తయారైతే ఇప్పుడు కొత్తగా నాటి ఇష్యూను తెర మీదకు తీసుకు రావడంపై విజయ్ టీవీకే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ సమస్య సద్ధుమణుగుతుందో లేక కొత్త సమస్యలు తెస్తుందో.