Meenakshi Chaudhary: మనోవేదనకు గురయ్యాను
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:44 PM
ఈ మధ్య ఆమె చేసిన సినిమా నిమిత్తం తనపై వచ్చిన ట్రోల్స్‌తో మనోవేదనకు గురయ్యానని అన్నారు హీరోయిన్ మీనాక్షి చౌదరి. తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆమె వెల్లడించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’ తనకు సక్సెస్ ఇచ్చి, నన్ను నిలబెట్టిందని అన్నారు. విషయంలోకి వస్తే..
విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరి తన మనసులోని బాధను తాజాగా వెల్లడించారు. ఈ మూవీలో తాను నటించిన పాత్రకు సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని, వాటిని చూసిన తాను తీవ్ర మనోవేదనకు గురైనట్టు పేర్కొన్నారు. దక్షిణ భారత చిత్రపరిశ్రమ హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలుగులో బిజీ హీరోయిన్‌గా అవకాశాలను సొంతం చేసుకుంటుంది. అలాగే తమిళంలో ‘కొలై’, ‘సింగపూర్ సలూన్’, ‘ది గోట్’ వంటి చిత్రాల్లో నటించింది. గత యేడాది దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన ‘లక్కీ భాస్కర్’లో ఓ బిడ్డకు తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. పైగా ఈ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఆమెకు కూడా మంచి పేరు వచ్చింది.
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మీనాక్షి చౌదరి... ‘ది గోట్’ మూవీలోని తన పాత్రపై స్పందించారు. ‘‘గత యేడాది విజయ్‌తో కలిసి ‘ది గోట్’ మూవీలో శ్రీనిధి అనే పాత్రలో నటించాను. ఈ పాత్రలో నటించినందుకు నన్ను అనేక మంది హేళన చేశారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేశారు. వీటిని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఆ తర్వాత నేను సోలో హీరోయిన్‌గా నటించిన ‘లక్కీ భాస్కర్’ విడుదలైంది. అందులో నా పాత్రకు మంచి మార్కులతో పాటు పేరు, ప్రశంసలు వచ్చాయి. దీంతో మనసు కుదుటపడింది’’ అని పేర్కొన్నారు.
గతేడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీనాక్షి చౌదరి.. ఈ సంవత్సరంలోనూ ఈ ‘సంక్రాంతికి’ బోణీ కొట్టబోతోంది. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు, సినిమాలో ఉన్న కంటెంట్‌పై నమ్మకంతో.. మరో మంచి హిట్‌ని ఈ సంక్రాంతికి కొట్టబోతున్నట్లుగా ఆమె ఇంటర్వ్యూలలో చెబుతోంది.