Vishal: వేదికపై స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్..! హుటాహుటిన ఆస్పత్రికి
ABN, Publish Date - May 12 , 2025 | 08:03 AM
కొంత కాలంగా తమిళ, తెలుగు నటుడు విశాల్ (Visha) అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.
కొంత కాలంగా తమిళ, తెలుగు నటుడు విశాల్ (Visha) అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది తన మదగజ రాజా చిత్రం విడుదల ఈవెంట్‌కు తీవ్రమైన జ్వరంతో హజరైన ఆయన మైక్ పట్టుకుని సరిగ్గా మాట్లాడలేక చేతులు బాగా వణికిన వీడియోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి కూడా. ఆ ఘటన తర్వాత తిరిగి దవాఖానలో చేరిన ఆయన వారం పది రోజుల ట్రీట్మెంట్ అనంతరం బయటకు వచ్చారు.
అయితే.. ఇప్పుడు అంతా ఒకే అనుకున్న సమయంలో తమిళనాడులోని విల్లుపురం (Villupuram) జిల్లా కూవాగం (Koovagam) లోని కూత్తాండవర్ ఆలయంలో ఆదివారం (మే 11) రాత్రి ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ (Visha) వేదికపై అందరినీ పలకరిస్తూ ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటపతో అక్కడి వారు షాక్ అవగా అక్కడ ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో హీరో విశాల్ కోలుకున్నాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన ఓ మంత్రి సాయంతో హస్పటల్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ ఘటనతో హీరో విశాల్ ఆరోగ్యంపై అంతటా మరోమారు చర్చ మొదలైంది. విశాల్‌కు అసలేమైంది ఏడాదిన్నరగా నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. సినిమాల కోసం తన లైఫ్ స్టైల్‌ను మార్చడం, డైటింగ్, వంటివి ఈ సమస్యలకు కారణమై ఉంటుందని అనుకుంటున్నారు.
ఈ విషయమై కొంతమంది విశాల్ మేనేజర్‌ను సంప్రదించగా ప్రస్తుతం హీరో ఆరోగ్యంగా ఉన్నాడని, ఆదివారం విశాల్ (Visha) లంచ్ చేయలేదని కేవలం జ్యూస్ మాత్రమే సేవించి అలాగే సాయంత్రం ఈవెంట్‌కు హజరయ్యాడని కార్యకమం ఆలస్యం అవడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు స్పష్టం చేశారు. డాక్టర్లు సైతం ఫుడ్ విషయంలో సీరియస్‌గా ఉండాలని ముఖ్యంగా ఈ వేసవిలో భోజనం స్కిప్ చేయవద్దని తెలిపినట్లు ఆయన చెప్పారు. తన ఆరోగ్యంపై విశాల్ త్వరలోనే వెళ్లడించనున్నట్లు సమాచారం.