Suriya: కమల్ హాసన్ బ్యానర్ లో సూర్య..?
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:18 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గత రెండేళ్లుగా సూర్య ఒక మంచి విజయం కోసం కష్టపడుతున్నాడు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గత రెండేళ్లుగా సూర్య ఒక మంచి విజయం కోసం కష్టపడుతున్నాడు. కానీ, ఆయన నటించిన కంగువ(Kanguva), రెట్రో(Retro) సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. దీంతో సూర్య తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో సూర్య తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ(Surydevara Nagavamsi) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసమే సూర్య.. వెట్రిమారన్ వాడివాసల్(Vaadivasal) ను వదులుకున్నాడని టాక్.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సూర్య మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క తన బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో మంచి మంచి సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. గతేడాది అమరన్(Amaran) లాంటి సినిమాను నిర్మించి మంచి హిట్ అందుకున్న కమల్.. ఈసారి సూర్యతో ఒక సినిమా చేయబోతున్నాడు.
కమల్ నటించిన విక్రమ్(Vikram) సినిమాలో సూర్య రోలెక్స్ అనే పాత్రలో నటించిన విషయం తెల్సిందే. విక్రమ్ సినిమాకు రోలెక్స్ క్యారెక్టర్ మరింత హైప్ ను తీసుకొచ్చింది. కమల్ మీద ఉన్న అభిమానంతో రోలెక్స్ పాత్రకు సూర్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించాడు. సినిమా హిట్ అయ్యాక కమల్.. సూర్యకు మంచి బహుమతిని అందజేసి కృతజ్ఞత తెలిపాడు. ఆ సమయంలోనే సూర్యతో ఒక ఫుల్ లెంత్ సినిమా చేయాలనీ ఉందని, కచ్చితంగా భవిష్యత్ లో చేస్తానని చెప్పుకొచ్చాడు. కమల్ చెప్పినట్లుగానే సూర్యతో ఒక మూవీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.