Suriya 47: సూర్య మరో కొత్త సినిమాని కూడా పట్టాలెక్కించేశాడు..
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:30 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) గత కొంతకాలంగా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కంగువతో భారీ నష్టపోయిన సూర్య .. దాని నుంచి బయటపడాలని చూస్తున్నాడు.
Suriya 47: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) గత కొంతకాలంగా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కంగువతో భారీ నష్టపోయిన సూర్య .. దాని నుంచి బయటపడాలని చూస్తున్నాడు. మధ్యలో రెట్రో సినిమా కూడా పరాజయాన్ని అందుకోవడంతో ఈసారి మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు(Karuppu) అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలు షూటింగ్ ను ఫినిష్ చేసుకుంటున్నాయి.
ఇక రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు సూర్య. రోమాంచమ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ జీతూ మాధవన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక గతేడాది ఆవేశం సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ ఆవేశం సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. ఈ సినిమాను తెలుగులో ఒక స్టార్ హీరో రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఆవేశం తరువాత జీతూ.. సూర్యకు కథ వినిపించడం, ఆయన ఓకే కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు సూర్య 47 వ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో సూర్య సరసన నజ్రియా నజీమ్ నటిస్తుండగా.. ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రేమలు సినిమాతో హీరోగా మారినా కూడా ఈ కుర్రాడు కేవలం హీరోగానే ఎదగాలి అనేది కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని విజయాలను అందుకుంటున్నాడు. లోక సినిమాలో కూడా ఇలాంటి ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇప్పుడు సూర్యతో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆవేశం లాంటి కథ సూర్యకి పడితే.. నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా సూర్య విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.