Kamal Haasan: కర్ణాటకలో 'థగ్‌లైఫ్’కు ఊరట
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:45 PM
కమల్‌హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. ఇలాంటి బెదిరింపులు చట్టబద్ధం కాదంది. థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించాలో నిర్ణయించే అదికారం ఆయా సంఘాలకు లేదని క్లారిటీ ఇచ్చింది.
సుప్రీంకోర్టులో ‘థగ్ లైఫ్' (thug life) సినిమాకు, బృందానికి ఊరట లభించింది. కమల్‌హాసన్, శింబు కీలక పాత్రధారులుగా మణిరత్నం దర్శకత్వం (mani ratnam) వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలోనూ ప్రదర్శించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆ రాష్ట్రంలో నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా మంగళవారం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కమల్‌హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. ఇలాంటి బెదిరింపులు చట్టబద్ధం కాదంది. థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించాలో నిర్ణయించే అదికారం ఆయా సంఘాలకు లేదని క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా ఒక ప్రకటన చేసినప్పుడు దాన్ని మరో కామెంట్‌తో ప్రతిఘటించే స్వేచ్ఛ ఉంది కానీ.. థియేటర్‌లు తగలబెడతామని బెదిరించే అదికారం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.
కర్ణాటక ప్రజలు కమల్‌హాసన్‌తో విభేదించే స్వేచ్ఛను కలిగి ఉన్నారని, అదే సమయంలో ప్రాథమిక హక్కులు కూడా కాపాడాలని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. ఆ సినిమాను చూసి ఆదరించాలా వద్దా అనేది మాత్రం ప్రజలకు ఉంటుంది. బెదిరించి సినిమాలను ఆపడం కరెక్ట్ కాదని సుప్రీం తెలిపింది. చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీం కోర్ట్ బదిలి చేసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో నటుడు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం ప్రశ్నించింది. థగ్‌లైఫ్ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలు ఉన్నప్పటికీ మిశ్రమ స్పందనకే పరిమితమైంది.