Urvashi: షారుక్ ఖాన్‌కు.. అవార్డు ఎలా ఇస్తారు! జ్యూరీపై ఊర్వ‌శి తీవ్ర విమ‌ర్శ‌లు

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:46 AM

ద‌క్షిణాది సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని న‌టి ఊర్వ‌శి

Urvashi

ద‌క్షిణాది సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని న‌టి ఊర్వ‌శి (Urvashi). 80ల‌లో క‌థానాయిక‌గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌ సినీ ఇండ‌స్ట్రీల‌లో పెద్ద స్టార్ల‌తో వ‌రుస సినిమాలు చేసి అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు క్యారెక్ట‌ర్ న‌టిగా మారి అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే గ‌త సంవ‌త్స‌రం పార్వ‌తి తిరువోతు (Parvathy Thiruvothu)తో క‌లిసి లీడ్ రోల్స్‌లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ఉళ్ళోజుక్కు (Ullozhukku ) థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పాటు టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. ఆపై ఓటీటీలోనూ మంచి ఆద‌ర‌న‌ను ద‌క్కించుకుంది. అందులో ఊర్వ‌శి, పార్వ‌తిల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి విశేషంగా ప్ర‌శంస‌లు సైతం ల‌భించాయి.

అయితే.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 71వ జాతీయ అవార్డుల‌లో (71st National Film Awards) ఈ సినిమాకుకు ఉత్త‌మ చిత్రంగా, ఇందులో లీడ్ రోల్లో న‌టించిన‌ ఊర్వ‌శికి ఉత్త‌మ స‌హాయ న‌టి అవార్డును క‌మిటీ ప్ర‌క‌టించింది. అయితే ఈ అవార్డుల తీరుపై న‌టి ఊర్వ‌శి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇటీవల ఓ మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జాతీయ అవార్డులపై ఆమె మాట్లాడుతూ.. తనకు ఉత్తమ సహాయ నటి అవార్డు ఎలా ఇచ్చారంటూ జ్యూరీని క్వశ్చన్ చేశారు‌. అసలు సహాయనటి అంటే ఏమిటో జ్యూరీ చెప్పాలని, ఉళ్ళోజుక్కు చిత్రంలో నా నటనను ఏ పద్దతిలో కొలిచారు, సపోర్టింగ్ అనే కేటగిరిలో నాకు ఎలా అవార్డు ప్ర‌క‌టించారంటు నిల‌దీశారు. ఆ సినిమాలో మ‌రో న‌టి, నేను క‌లిసి లీడ్ రోల్స్ చేశామ‌ని వయసు పైబడితే సహాయనటిగా పరిగణిస్తారా అంటూ ప్ర‌శ్నించారు. అయినా.. మీరు ఇవ్వగానే వచ్చి సైలెంట్‌గా తీసుకోడానికి అదేమీ పెన్షన్ కాదంటూ కామెంట్స్ చేశారు.

ఇదిలాఉంటే.. ఇక షారుక్ ఖాన్‌కు జవాన్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడంపై ఊర్వశి విమర్శలు గుప్పించింది. అసలు షారుక్ ఖాన్‌కు ఎలా ఆ అవార్డు ఇస్తారు. పూక్కళమ్ సినిమాకు గాను మలయాళ నటుడు విజయ రాఘవన్ కి బెస్ట్ సపోర్టింగ్ కేటగిరిలో అవార్డు ఇచ్చారు. నిజానికి ఆయ‌న‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి. ఆ సినిమాలో ఓ పాత్రను నన్ను చేయమని అడిగితే నాకు కష్టం అనిపించి చేయలేదు. కానీ విజయ్ రాఘవన్ (Vijayaraghavan) ఎంత కష్టమైనా ఆ పాత్ర చేసాడు. కానీ అతడికి సపోర్టింగ్ రోల్ పేరుతో అవార్డు ఇచ్చి స‌రి పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. అది పెద్ద సినిమా కాదని, 250 కోట్ల సినిమా కాదని, పెద్ద హిట్ అవ్వలేదని‌ ఉత్తమనటుడు అవార్డు ఇవ్వలేదా అంటూ తెగిడారు. షారుక్ ఖాన్ గతంలో మంచి నటన కనబరిచిన సినిమాలను ప‌ట్టించుకోకుండా వ‌దిలేసి ఇప్పుడు జవాన్ సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం ఏంటో నేషనల్ అవార్డ్స్ జ్యూరీకే తెలియాలని అన్నారు.

అయితే.. ఊర్వ‌శి ఈ అవార్డు స్వీక‌రిస్తుందా లేదా అనేది వెయ్యి డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది. తాజాగా ఆమె చేసిన విమ‌ర్శ‌ల‌ను బ‌ట్టి చూస్తే అవార్డు తీసుకోకూడ‌ద‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ది గోట్లైఫ్ సినిమాలో ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌ట‌న‌ను కాద‌ని షారుఖ్ ఖాన్‌కు ఇవ్వ‌డంపై ఇప్ప‌టికే సౌత్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అంతేగాక షారుఖ్ ఖాన్‌తో క‌లిసి గ‌తంలో స్వ‌దేశ్ అనే సినిమా తీసిన ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవారిక‌ర్ (Ashutosh Gowariker) ఈ జ్యూరీలో కీల‌క మెంబ‌ర్ కావ‌డంతోనే ఉత్త‌మ న‌టుడు, న‌టి అవార్టు అక్క‌డి వారికి ఇచ్చిన‌ట్లు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. 2018లో మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో ఇలాంటి ఘ‌ట‌న ఎదురై నాడు ఫ‌హాద్ ఫాజిల్‌, పార్వ‌తి తిరువోతు త‌మ‌కు ప్ర‌క‌టించిన అవార్డుల‌ను స్వీక‌రించ‌కుండా బాయ్‌కాట్ చేయ‌డం విశేషం.

Gxgcsq7WcAAAsyl.jpg

Updated Date - Aug 06 , 2025 | 09:55 AM