Siddharth: స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:20 PM
బొమ్మరిల్లు సినిమాతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశాడు సిద్దార్థ్ (Siddharth).
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశాడు సిద్దార్థ్ (Siddharth). ఈ సినిమా తరువాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సిద్దు మధ్యలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి అలరిస్తున్నాడు. తాజాగా సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 3BHK. శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా 3BHK ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక కల. ఎప్పటికైనా తన సొంత ఇంట్లోనే మరణించాలి అనేది ప్రతి తండ్రి కోరుకుంటాడు. అలానే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆరాటపడేవాడే వాసుదేవన్. భార్య, ఒక కొడుకు, ఒక కూతురు. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం. అయితే వాసుదేవన్ తన సేవింగ్స్ అన్ని పోగుచేసి ఒక 3BHK కొనాలని చూస్తాడు. కానీ, ఆ సేవింగ్స్ సరిపోవు. దీంతో అతని కల.. కలలానే ఉంటుంది. ఎప్పటికైనా తాను చేయలేనిది తన కొడుకు సిద్దార్థ్ చేస్తాడని ఎదురుచూస్తూ ఉంటాడు. చదువు రాని సిద్దార్థ్.. సరైన జాబ్ లేక కష్టపడుతూ ఉంటాడు. మరి చివరకు కొడుకు.. తండ్రి కల నెరవేర్చడా.. ? వాసుదేవన్ సొంతిల్లు కొన్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఈ సినిమా అంకితమని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి 35 ఏళ్లు వచ్చేవరకు ఒక మధ్యతరగతి యువకుడు పడే ప్రతి బాధను ఈ సినిమాలో చూపించారని తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సిద్దార్థ్ బాగా ఎమోషనల్ అయ్యాడు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎంతో బాగా సపోర్ట్ చేసారని, వారివల్లనే తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రతి విషయంలో వారు తన వెన్ను తట్టారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాకుండా తాను 3BHK సినిమా చేస్తున్నాను అని చెప్పగానే తన తండ్రి సూర్య నారాయణన్ చాలా గర్వపడ్డారని, అప్పట్లో తాము కూడా 3BHK లోనే ఉండేవారమని చెప్పుకొచ్చాడు.
' నాకిది 40 వ సినిమా. ఈ సినిమాలో నా తల్లిదండ్రులు కూడా భాగం అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది. కెరీర్ మొదలుపెట్టినప్పటి మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఎన్నో సినిమాలు చేశాను. ఇది నా 40 వ సినిమా అని నా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పినప్పుడు ఆయన నన్ను చూసి గర్వపడ్డారు. నా తల్లిదండ్రులు నాకెంతో సపోర్ట్ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. నాకు తోడుగా నిలబడ్డారు. వారు సంపాదించిన డబ్బు అంతా నాకే ఖర్చుపెట్టారు. నన్నెంతో నమ్మారు. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి పేరెంట్స్ కనిపిస్తారు. శరత్ కుమార్, దేవయాని ఎంతో అద్భుతంగా నటించారు. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కు థ్యాంక్స్ చెప్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే జూలై 4 న 3 BHK రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో సిద్దార్థ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Manchu Vishnu: ఎట్టకేలకు హిట్ కొట్టిన మంచు విష్ణు