Shiva Rajkumar: కమల్ వివాదంలో ఇరుక్కున్న శివన్న

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:25 PM

ఎంకి పెళ్లి సుబ్బు చావు కొచ్చినట్టు తయారైంది కన్నడనాట లోకనాయకుడు చేసిన రచ్చ. తాను ప్రాబ్లం లో పడడమే కాదు మరో హీరోని కూడా ఇందులో లాగినంత పని చేశాడు. ఇంకేముంది కమల్ ని కాస్త సైడ్ పెట్టి.. కన్నడ నెటిజన్లు మరో హీరో పైన పడుతున్నారు.

కమల్ హాసన్ (Kamal Haasan) కన్నడ నాట రేపిన రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదు.‌ థగ్ లైఫ్ (Thug Life) ఈవెంట్‌లో ఆయన చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు అక్కడ కాక రేపింది. కన్నడ భాష (Kannada controversy) తమిళం నుంచి పుట్టింది అని కమల్ అనడంతో, కన్నడిగులు ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఈ మాట కన్నడ భాషను డౌన్ చేసినట్టు ఉందని, వెంటనే కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, ర్యాలీలతో రచ్చ చేస్తున్నారు. కానీ, ఈ గొడవ ఇప్పుడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌(Shiva Rajkumar) ని కూడా ఇరికించింది.


థగ్ లైఫ్ ఈవెంట్‌కి శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యకి శివన్న చప్పట్లు కొట్టారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో శివరాజ్‌ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఈ గొడవ మధ్యలో ఇరుక్కున్న శివరాజ్ కుమార్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

తాను అన్ని భాషలను రెస్పెక్ట్ చేస్తానని... తన మొదటి ప్రాధాన్యత ఎప్పటికీ కన్నడ భాషే అని శివన్న స్పష్టం చేశారు. ఆ రోజు కమల్ తన మీద అభిమానం చూపిస్తూ మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టానే తప్ప, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను సపోర్ట్ చేయలేదని క్లియర్ చేశారు. కొందరు తన మీద బురద చల్లాలని ట్రై చేసినా, ప్రజలకు తను ఎలాంటి వాడినో బాగా తెలుసు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ గొడవ ఎటు వెళ్తుంది, కన్నడ నాట 'థగ్ లైఫ్' విడుదల అవుతుందా లేదా? అనేది వేచి చూడాలి.

Updated Date - Jun 02 , 2025 | 04:32 PM