Mohanlal: మోహన్ లాల్ 'వృషభ'లో.. రోషన్ మేకా నటించి ఉంటే
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:59 PM
మోహన్ లాల్ నటించిన 'వృషభ' చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 25న రాబోతోంది. ఈ సినిమాలో మొదట మోహన్ లాల్ కొడుకు పాత్రకు రోషన్ మేకా ను తీసుకున్నారు. ఇప్పుడీ పాత్రను కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేశ్ కొడుకు సమర్జిత్ పోషించాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) నటించిన 'వృషభ' (Vrushabha) సినిమా రెండేళ్ళ కిత్రం మొదలైంది. 'ద వారియర్ ఎరైజ్' అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను నందకిషోర్ (Nanda Kishore) తెరకెక్కించారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిలిమ్స్, ఏవీఎస్ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించారు.
తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. రాగిణీ ద్వివేదీ కీలక పాత్రను పోషించిన ఈ సినిమాకు 'బాహుబలి, మన్యం పులి, ది బాస్, గజిని, రోబో, పుష్ప ది రైజ్' వంటి సినిమాలకు పని చేసి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ వర్క్ చేశారు.
చిత్రం ఏమంటే తండ్రీ కొడుకులకు సంబంధించిన ఈ పిరియాడికల్ యాక్షన్ మూవీలో మొదట మోహన్ లాల్ కొడుకుగా శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ మేకా (Roshan Meka) ను ఎంపిక చేశారు. కొంతకాలం షూటింగ్ లోనూ రోషన్ పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత అతని స్థానంలో కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్ కొడుకు సమర్జిత్ లంకేష్‌ను తీసుకున్నారు. దీనికి ముందు సమర్జిత్ కేవలం'గౌరి' అనే సినిమాలో మాత్రమే నటించాడు. అతనికి ఇది రెండో సినిమా.
ఈ సినిమా కోసం ఈ యంగ్ హీరో యాక్టింగ్ కు సంబంధించిన కోర్స్ చేశాడు. మోహన్ లాల్ తనయుడిగా సమర్జిత్ ఏ మేరకు న్యాయం చేశాడనేది వేచి చూడాలి. మరో విషయం ఏమంటే.. రోషన్ మేకా హీరోగా నటించిన 'ఛాంపియన్' మూవీ ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు 'వృషభ' మూవీ సైతం పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు 25న వస్తోంది. ఇందులో ముందు అనుకున్నట్టు రోషన్ మేకా నటించి ఉంటే.. అతని రెండు సినిమాలూ ఒకదానితో ఒకటి పోటీ పడి ఉండేవి.