Sachin Tendulkar 3BHK: ఈ మధ్య చూసిన, నచ్చిన సినిమా ఇదే.. 3 BHKకి సచిన్ ప్రశంసలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 08:10 AM
ఈ మధ్య చూసిన, నచ్చిన సినిమా ఇదే.. 3 BHKకి సచిన్ ప్రశంసలు కురిపించారు
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ఫర్వాలేదనిపించుకున్న సినిమా (3 BHK). ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలు, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆపై ఓటీటీలకి సైతం వచ్చిన ఈ చిత్రం థియేటర్లకు మించి ఆదరణను దక్కించుకుంది. ఇంకా దక్కించుకుంటుంది. చిత్తా వంటి సెన్సిబుల్ థ్రిల్లర్ తర్వాత బొమ్మరిల్లు సిద్ధార్థ్ (Siddharth) హీరోగా నటించగా శరత్ కుమార్ (R Sarath Kumar), చైత్ర జే అచార్, మితా రఘునాధ్, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీ గణేశ్ (Sri Ganesh) దర్శకత్వం వహించాడు.
ఓ మధ్య తరగతి కుటుంబం సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి తమ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కి ప్రతి ఒక్కరిని టచ్ చేసింది. అయితే ఇప్పడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా విశేష ఆదరణ పొందుతుంది. ఇదిలాఉంటే ఈ చిత్రం ఓటీటీకి వచ్చి దాదాపు నెల గడుస్తుండగా తాజాగా ఇప్పుడు మరోసారి నేషనల్ వైడ్ ట్రెండింగ్‌కు వచ్చేసింది. అందుకు కారణం క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).
ఇటీవల రెడిట్ లో అభిమానులతో చాటింగ్ చేసిన ఆయనకు ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో సినిమాలు ఏమైనా చూస్తారా అని ఫ్యాన్స్ నుంచి ప్రశ్న ఎదురైంది. అందుకు సచిన్ (Sachin Tendulkar) స్పందిస్తూ ఇటీవల 3 బీహెచ్‌కే (3 BHK), అతా తంబైచ నాయ్ (Ata Thambaycha Naay) అనే సినిమాలు చూశానని నాకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో సినిమా యూనిట్ ఎగిరి గంతేసింది. ఈ సందర్భంగా సచిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు సచిన్ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఆ యా సినిమాలను జాతీయ స్థాయిలో ట్రెండ్ చేస్తున్నారు.