Kantara Chapter1: కేరళలో.. కాంతార1పై నిషేదం?

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:19 PM

ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్ 1పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. కానీ కేరళలో పంపిణీ ఒప్పందాలపై వివాదం కారణంగా ఈ చిత్రం విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Kantara Chapter 1

గ‌తంలో చిన్న చిత్రంగా క‌న్న‌డ నాట విడుద‌లై ఆ త‌ర్వాత మ‌న దేశాన్ని షేక్ చేసిన చిత్రం కాంతార‌. రిషబ్ శెట్టి (Rishabh Shetty) నటించిన ఈ చిత్రానికి ఫ్రీక్వెల్‌గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండ‌గా అయా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే బిజినెస్‌లు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కేరళ (Kerala) రాష్ట్రంలో ఈ చిత్రానికి నిషేధం విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ ( Film Exhibitors Union of Kerala FEUOK) అధ్యక్షుడు కే. విజయకుమార్ (K. Vijayakumar)మాట్లాడుతూ, “కేరళలో ఇతర భాషల సినిమాలను విడుదల చేసే సమయంలో తొలి వారం రోజుకు గరిష్టంగా 50% లాభాల్లో వాటా మాత్రమే డిమాండ్ చేయడానికి అనుమతి ఉంది. కానీ కాంతార చాప్టర్ 1 కేరళ హ‌క్కులు తీసుకున్న‌ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మాత్రం రెండు వారాల పాటు 55% లాభాలను డిమాండ్ చేస్తోంది. ఇది మా నియమాలకు విరుద్ధం అని అన్నారు. COVID సమయంలో మాత్రమే ప్రత్యేక సందర్భాల్లో 55% లాభాలను పంపిణీదారులకు అనుమతించామ‌ని ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని అంగీకరించమ‌ని తెలిపారు.

అలాగే ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. “తుడ‌రం చిత్రం కేరళలో భారీ విజయాన్ని సాధించినా, ఇతర రాష్ట్రాల్లో విడుదల చేసినప్పుడు నిర్మాత ఎం. రంజిత్ నష్టాలను ఎదుర్కొవాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో పెద్ద బ్యానర్లు ఇతర భాషల సినిమాలకు వ‌చ్చే లాభాల్లో ఎక్కువ వాటాను డిమాండ్ చేస్తుండగా, తమ సినిమాలను ఇతర రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నప్పుడు మాత్రం 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే వాటాకు ఒప్పుకుంటున్నారన్నారు.”

లాభాల‌ వాటాల‌ విషయంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ కఠినంగా ఉండంతో.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) కేరళలో విడుదలపై తీవ్ర‌ సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రానికి ఉన్న భారీ అంచనాలు, డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలపై వివాదం మూవీ విడుదలలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కైతే కేర‌ళ‌లో కాంతార చిత్రం నిషేదంపై వార్త‌లు బాగానే చ‌క్క‌ర్లు కొడుతున్నాయి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. వారం ప‌ది రోజుల్లో ఈ వార్త‌ల‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Updated Date - Sep 11 , 2025 | 05:39 PM