Retro: థియేటర్ లో ప్లాప్ చేసి.. ఓటీటీలో హిట్ అంటారేంటి.. ?
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:06 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హీరోగా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ( Karthik Subbaraj) దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో సినిమా మీద అభిమానులు మొదటి నుంచి ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.
ఈమధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుందో ఎవరం చెప్పలేకపోతున్నారు. కథ బావుంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా హిట్ చేసేస్తున్నారు. పెద్ద సినిమా, స్టార్ హీరో సినిమా అయినా నచ్చకపోతే నిర్మొహమాటంగా ముఖం మీదే నచ్చలేదని చెప్పేస్తున్నారు. కథ నచ్చినా.. నచ్చకపోయినా ఓటీటీలో చూసేస్తున్నారు. అందుకే మేకర్స్ ఎక్కువ థియేటర్స్ లో సినిమాలను రిలీజ్ చేయడం మానేసి ఓటీటీల బాట పడుతున్నారు.
ఒక సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది అంటే.. ఓటీటీలో కూడా అంతే హిట్ అవుతుంది అనుకోలేం. అలాగే ఒక సినిమా థియేటర్ లో ప్లాప్ అయ్యింది అంటే ఓటీటీలోకూడా పరాజయం పాలవుతుందని కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లో కంటే ఓటీటీలోనే బాగా హిట్ అవుతున్నాయి. అలాంటి కేటగిరీలో చేరిందే రెట్రో(Retro) మూవీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హీరోగా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ( Karthik Subbaraj) దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో సినిమా మీద అభిమానులు మొదటి నుంచి ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.
కంగువ(Kanguva) లాంటి భారీ బడ్జెట్ సినిమా పరాజయం అందుకున్న తరువాత సూర్య నుంచి వస్తున్న సినిమా కావడం, సూర్య లుక్స్ అన్ని వింటేజ్ లో ఉండడంతో తమిళ్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు అభిమానులు కూడా రెట్రో సూర్య కేరెర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది అనుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజు నాని(Nani) హిట్ 3 కూడా రిలీజ్ అయ్యింది.
ఇక హిట్ 3, రెట్రోల మధ్య గట్టి పోటీ జరిగి చివరకు హిట్ 3(Hit 3) విన్నర్ గా నిలిచింది. కార్తీక్ సుబ్బరాజ్.. తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడని, స్టోరీ అంతా అంతకుముందు వచ్చిన సినిమాల మిక్స్డ్ అని పెదవి విరిచారు. ఇక రెండేళ్లుగా హిట్ లేని పూజా హెగ్డే(Pooja Hegde) ఏదైనా అద్భుతం చేస్తుంది అనుకుంటే.. ఆమె పాత్ర కూడా అంత బాలేదని చెప్పుకొచ్చారు. తమిళ్ లో సూర్య ఫ్యాన్స్ ను మెప్పించినా.. తెలుగువారిని మాత్రం రెట్రో మెప్పించలేకపోయింది.
థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన రెట్రో మే 30 న ఓటీటీలో ప్రత్యక్షమయ్యింది. నెట్ ఫ్లిక్స్(Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. మే 30 నుంచి రెట్రో నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఓటీటీ కావడంతో థియేటర్ లో మిస్ అయ్యినవారందరూ చూడడం మొదలుపెట్టారు. గత రెండు రోజుల నుంచి నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో రెట్రో కొనసాగుతుంది. దీంతో సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఓటీటీలో చూడడానికి బావుందని చెప్పుకొస్తున్నారు. కొందరు మాత్రం థియేటర్ లో ప్లాప్ చేసి.. ఓటీటీలో హిట్ అంటారేంటి.. ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి రెట్రో థియేటర్ లో హిట్ అవ్వకపోయినా.. ఓటీటీలో హిట్ అవుతుందేమో చూడాలి.