Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. హీరోయిన్‌కు రూ.102.55కోట్ల ఫైన్
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:32 PM
కన్నడ నటి రన్యారావుపై బంగారం అక్రమ రవాణా కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ భారీ చర్యలు తీసుకుంది.
కన్నడ నటి రన్యారావు (Ranya Rao)పై బంగారం అక్రమ రవాణా కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) భారీ చర్యలు తీసుకుంది. తాజాగా ఆమెకు రూ.102.55 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రన్యా సహా నలుగురు నిందితులకు కలిపి రూ.270 కోట్ల పెనాల్టీ విధించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించకుంది.
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి తొలి వారంలో రన్యారావు దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. ఈ ఘటన తర్వాత ఆమెపై సీబీఐ, డీఆర్‌ఐ విచారణలు కొనసాగుతుండగా, ఆధారాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా, తన చిన్నాన ఐపీఎస్ హోదాను వినియోగించుకుని, ఎయిర్‌పోర్టు చెకింగ్‌లను తప్పించుకొని బంగారం స్మగ్లింగ్ కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో.. ఈడీ దర్యాప్తులో భాగంగా రన్యారావు పేరుతో ఉన్న రూ.34 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు (COFEPOSA) రన్యారావుతో పాటు ఆమె భాగస్వామి తరుణ్, మరో నిందితుడు సాహిల్లకు కూడా ఒక సంవత్సరపు జైలు శిక్ష ఖరారు చేసింది.