SM Raju: షూటింగ్ లో స్టంట్ మాస్టర్ మృతి

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:46 PM

సినిమా రంగుల ప్రపంచం మాత్రమే కాదు... ఇందులో అప్పుడప్పుడు విషాద ఛాయాలూ దర్శనం ఇస్తుంటాయి. అనుకోని ప్రమాదాలు జరగడమే కాదు అవి ప్రాణాలనూ హరిస్తాయి. తాజాగా కోలీవుడ్ లో అలాంటి విషాదమే చోటు చేసుకుంది.

సినీ పరిశ్రమలో జరుగుతున్న వరుస విషాద సంఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి. కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao), బి. సరోజాదేవి (Saroja Devi) మృతిని మరిచిపోక ముందే కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకోవడం కలవరపరస్తోంది. స్టంట్ మాస్టర్ రాజు (52) (SM Raju) మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుము కున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. స్టంట్ మాస్టర్ రాజు ఇకలేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామని ఎమోషనల్ అవుతున్నారు.


కొత్త టెక్నాలజీ వచ్చినా, హై-టెక్ గాడ్జెట్స్, సేఫ్టీ మోడల్స్ అడాప్ట్ చేసుకున్నా స్టంట్‌మెన్ల సేఫ్టీ ఇప్పటికీ పెద్ద సమస్యగా మారింది. ఇటీవల ప్రమాదాలు మరీ ఎక్కువై పోతున్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి దుర్ఘటనే జరిగి ఒకరి ప్రాణం పోయింది. హీరో ఆర్య (Arya) నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టువం’ (Vettuvam) షూటింగ్ లో జరిగిన హై-రిస్క్ కారు పల్టీ స్టంట్ సమయంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. గడిచిన రెండు రోజులుగా ఈ సినిమా షూటింగ్ నాగపట్నం జిల్లాలోని కీజాయూర్ సమీపంలోని వేదమామిడి గ్రామంలో జరగుతోంది. అక్కడ జరిగిన ప్రమాదంలో ప్రముఖ స్టంట్ ఆర్టిస్ట్ ఎస్. ఎం. రాజు మరణించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ యాక్సిడెంట్ వీడియో చూస్తే గుండె తరుక్కుపోతోంది. డైరెక్టర్ పా. రంజిత్ (Pa. Ranjith) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎస్. ఎం. రాజు ఓ హై-స్పీడ్ కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో పాల్గొన్నాడు. సీన్ షూట్ చేస్తున్న సమయంలో కారు రాంప్‌పైకి ఎక్కి, అనుకోని విధంగా బోల్తా కొట్టి క్రాష్ అయ్యింది. షాట్ పూర్తయ్యాక క్రూ సభ్యులు వెళ్లి చూస్తే.. రాజు తీవ్ర గాయాలతో ఉన్నాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.


ఎస్. ఎం. రాజు తమిళ సినిమా ఇండస్ట్రీలో హై యాక్షన్ సీన్స్‌ ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. అతని ఆకస్మిక మరణం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ సినిమా 2021లో వచ్చిన ‘సర్పట్ట పరంబరై’కు సీక్వెల్ అని తెలుస్తోంది. ఇది వచ్చే యేడాది విడుదల కానుంది. ఈ ప్రమాదం స్టంట్స్ ఆర్టిస్టులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోసారి చర్చనీయాంశం చేసింది.

Updated Date - Jul 14 , 2025 | 06:20 PM