Rajinikanth: రజనీకి అభినందనలు... సోషల్ మీడియాలో ట్రెండింగ్
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:02 AM
రజనీకాంత్ డిసెంబర్ 12తో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అంతేకాదు ఈ యేడాదితో ఆయన నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేశారు. దాంతో సినీ, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటునిగా ఈ యేడాదితో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు... ఇటీవలే గోవా- ఇఫ్ఫీలో రజనీకి ఘనసన్మానం కూడా జరిగింది... డిసెంబర్ 12తో రజనీ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు... ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా రజనీకాంత్ సహ నటీనటులు, వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియచేస్తూ, సోషల్ మీడియాను షేక్ చేశారు.
ఆసేతు హిమాచల పర్యంతం తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్... ఆయన నటించిన తొలి చిత్రం 'అపూర్వ రాగంగళ్' ఈ యేడాది ఆగస్టు 15తోనే యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది... అంటే నటునిగా స్వర్ణోత్సవం చూశారు రజనీ... ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే రజనీకి గోవా- ఇఫ్ఫీలో ఘన సత్కారం జరిగింది... ఈ యేడాది డిసెంబర్ 12తో రజనీకాంత్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అలా రజనీకి ఈ బర్త్ డే ఓ స్పెషల్... తెలుగువారితోనూ రజనీకాంత్ కు అనుబంధం ఉంది... తెలుగులో నటించిన తొలి చిత్రం 'అంతులేని కథ'తోనే రజనీకాంత్ జనం మది దోచుకున్నారు... నాటి నుంచీ నేటి దాకా అదే తీరున తెలుగు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నారు రజనీకాంత్.
రజనీకాంత్ ను తమిళ, తెలుగు తెరలకు పరిచయం చేసింది దర్శకదిగ్గజం కె.బాలచందర్... ఆయన చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు ధరించిన రజనీకాంత్, పలు సినిమాల్లో విలన్ గానూ అభినయించారు... ఒక్కో మెట్టూ ఎక్కుతూ సూపర్ స్టార్ గా నిలచిన రజనీకాంత్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ అయి విశేషాదరణ చూరగొన్నాయి... తెలుగు నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు 'అంధా కానూన్'తో హిందీ తెరకు పరిచయమైన రజనీకాంత్ అక్కడివారినీ అలరించారు... అలా ఉత్తరదక్షిణాదిని మురిపించిన రజనీకాంత్ కు విదేశాల్లోనూ అభిమానగణాలు లభించడం విశేషం!
రజనీకాంత్ నటునిగా, నిర్మాతగా తనదైన బాణీ పలికించారు... కొన్నేళ్ళ క్రితం రాజకీయాల్లో రాణించాలనీ ఆశించారు... అయితే ఆరంభంలోనే పాలిటిక్స్ తనకు తగవని తెలుసుకొని ఆ ప్రయత్నానికి స్వస్తి పలికారు... యాభై ఏళ్ళ సినీ జీవితంలో రజనీకాంత్ పలు విలక్షణమైన పాత్రల్లో మెప్పించారు... పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకొన్న రజనీకాంత్ - ఏపీ ప్రభుత్వం యన్టీఆర్ నేషనల్ అవార్డుకూ ఎంపికయ్యారు... 2019లో రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డూ లభించింది... మళ్ళీ జన్మ ఉంటే రజనీకాంత్ గానే పుడతాను అంటున్నారాయన... రజనీ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం...