Rajanikanth: మీ కృషి, వ్యక్తిత్వం అద్భుతం
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:11 AM
‘బైసన్’ (Bison) దర్శకుడు మారి సెల్వరాజ్‌పై (Mari Selvaraj) సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.
‘బైసన్’ (Bison) దర్శకుడు మారి సెల్వరాజ్‌పై (Mari Selvaraj) సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మీ కృషి, ప్రతిభ, వ్యక్తిత్వం ఆశ్చర్యం కలిగిస్తుంది’ అంటూ కితాబిచ్చారు. ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), రజీషా విజయన్ జంటగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ‘బైసన్’ ఈ నెల 17వ తేదీ విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్, నిర్మాత పా.రంజిత్‌లను రజనీకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. రజనీ ప్రశంసించిన విషయాన్ని మారి సెల్వరాజ్ ఎక్స్ వేదికలో వెల్లడించారు. ‘సూపర్ మారి.. సూపర్. ‘బైసన్’ సినిమా చూశాను. ప్రతి చిత్రంలో మీ కష్టం, మీ వ్యక్తిత్వం ఆశ్చర్యం కలిగిస్తుంది. అభినందనలు మారి సెల్వరాజ్’ అని తెలిపారు. గతంలో తాను దర్శకత్వం వహించిన ‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్’, ‘వాళై’ సినిమాలు చూసి ఏ విధంగా అభినందించారో అదేవిధంగా ‘బైసన్’ మూవీని చూసి తలైవర్ ప్రశంసించారని మారి సెల్వరాజ్ పేర్కొన్నారు.
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ బ్యానర్ మీద పా. రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ నిర్మాతలుగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ పై అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతాన్ని అందించారు.