Rajinikanth: తగ్గిన రజినీ స్టామినా.. సింగిల్ గా రావడం కష్టమే
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:44 PM
కోలీవుడ్ టాప్ టెన్ గ్రాసర్స్ లో నాలుగు సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వే ఉన్నాయి. అయినా కొంత కాలం నుంచీ రజనీ తన మూవీస్ మురిపించడానికి ఇతర స్టార్ హీరోస్ పై ఆధారపడటం కనిపిస్తోంది.
Rajinikanth: కోలీవుడ్ టాప్ టెన్ గ్రాసర్స్ లో నాలుగు సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వే ఉన్నాయి. అయినా కొంత కాలం నుంచీ రజనీ తన మూవీస్ మురిపించడానికి ఇతర స్టార్ హీరోస్ పై ఆధారపడటం కనిపిస్తోంది. కోలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో నిలచిన రజనీకాంత్ చిత్రాలు "2.0, జైలర్, కూలీ, యంతిరన్" వీటిలో "యంతిరన్, జైలర్" చిత్రాలు జెన్యూన్ హిట్స్ గా నిలిచాయి. '2.0' సినిమా గత ఏడేళ్ళుగా నంబర్ వన్ గ్రాసర్ గా నిలచినా, అప్పట్లో దానిని ఏవరేజ్ గానే గణించారు. ఇక ఈ యేడాది వచ్చిన 'కూలీ' 500 కోట్లు చూసినా, లాభసాటి కాదని తేల్చేశారు. 2010లో 'యంతిరన్' తరువాత రజనీకాంత్ ను వరుస ఫ్లాపులు పలకరించాయి. '2.0' ఏవరేజ్ కాగా, ఆ పై వచ్చిన మూడు సినిమాలు మురిపించలేక పోయాయి.
రెండేళ్ళ క్రితం 'జైలర్'తో జెన్యూన్ హిట్ చూసిన రజనీకాంత్ మళ్ళీ వరుస పరాజయాలను చవిచూశారు. ఈ నేపథ్యంలోనే 'జైలర్-2'లో పలువురు ఇతర స్టార్ హీరోస్ ను నటింప చేయాలని ఆశిస్తున్నారు రజనీకాంత్. 73 ఏళ్ళ వయసులో 'జైలర్'తో హిట్టు కొట్టిన హీరోగా రజనీకాంత్ జేజేలు అందుకున్నా, అందులోనూ మళయాళం నుండి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, హిందీ నుండి జాకీష్రాఫ్ వంటి సీనియర్స్ కనిపించారు... అందువల్లే ఇతర భాషల్లోనూ 'జైలర్' సినిమా ఆదరణ పొంది, చివరకు సూపర్ హిట్ గా నిలచిందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.. రాబోయే 'జైలర్- 2'లోనూ మరో సూపర్ స్టార్ తో సాగే ప్రయత్నంలో ఉన్నారట రజనీకాంత్.
'జైలర్-2'లో రోజుకో పరభాషా సూపర్ స్టార్ పేరు వినిపిస్తూ ఉండడం విశేషంగా మారింది. ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఇందులో కేమియో అప్పియరెన్స్ ఇస్తారని అన్నారు. ఆ తరువాత మళయాళ స్టార్ మమ్ముట్టి పేరూ షికార్లు కొట్టింది. ఇప్పుడు ఓ కీలక పాత్రలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. ఇటీవల ఓ బెంగాలీ మీడియా ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి 'జైలర్ -2'లో షారుఖ్ ఖాన్ నటిస్తున్నారని లీక్ చేసేశారు. అలా రజనీకాంత్ తో షారుఖ్ ఖాన్ నటించబోతున్నారని వినిపిస్తోంది.
చాలా రోజులుగా రజనీకాంత్ సేఫ్ గేమ్ ఆడటానికే ట్రై చేస్తున్నారని అందులో భాగంగానే ఇతర భాషల స్టార్ హీరోస్ ను తన చిత్రాల్లో కేమియో రోల్స్ లో నటింప చేసుకుంటున్నారని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి... ఇక 'జైలర్ -2'లోనూ అదే తీరున షారుఖ్ ఖాన్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో షారుఖ్ ఖాన్ 'రా-వన్'లో రజనీకాంత్ ఓ కేమియో రోల్ పోషించారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, రజనీకాంత్ పై ఎంతో అభిమానంతో షారుఖ్ ఖాన్ 'జైలర్-2'లో నటించడానికి అంగీకరించారని బాలీవుడ్ టాక్... ఇతర భాషల హీరోలతో సాగినంత మాత్రాన రజనీకాంత్ కు బంపర్ హిట్ లభించదని పరిశీలకులు అంటున్నారు... 'వేట్టైయాన్'లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానాతో సాగిన రజనీ.. 'కూలీ'లో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ నటించినా, అంతగా ఆకట్టుకోలేక పోయిందని గుర్తు చేస్తున్నారు.. ఇక ఇవన్నీ చూస్తున్న నెటిజన్స్ మాత్రం రజినీ స్టామినా తగ్గిందని, సింగిల్ గా రాలేక స్టార్స్ వెంట పడుతున్నారని అంటున్నారు. మరి షారుఖ్ ఖాన్ తో కలసి రజనీ నటించబోతున్న 'జైలర్-2' ఎలా ఉంటుందో చూడాలి.