Rajinikanth: రజనీ గోల్డెన్ జూబ్లీ.. 'నరసింహ' 4K రీ రిలీజ్! థియేటర్ల వద్ద రచ్చ రచ్చే
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:13 AM
మూడు దశాబ్దాలకు పైగా సినీ జగత్తును ఏలుతున్న ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.
మూడు దశాబ్దాలకు పైగా సినీ జగత్తును ఏలుతున్న ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలోనే కాదు, జపాన్, మలేషియా, సింగపూర్ వంటి విదేశాల్లోనూ ఆయనకో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు, థియేటర్ల వద్ద అభిమానుల సందడి అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి.
అయితే ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. అపూర్వ రాగంగల్ చిత్రంతో చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చి తమిళ సినిమాలలో సూపర్‌స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. రజినీకాంత్ కెరీర్‌లో సినిమాల్లోకి అడుగుపెట్టి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రజనీ సినీ ప్రయాణం గోల్డెన్ జూబ్లీ చేరుకోవడం ఆయన అభిమానులందరికీ నిజంగా గర్వకారణం. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.
రజనీకాంత్ కెరీర్‌లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మరియు భారీ సూపర్ హిట్‌గా నిలిచిన సినిమా పడయప్ప (Padayappa) తెలుగులో నరసింహ (Narasimha) సినిమాగా సూపర్‌సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని, ప్రపంచ వ్యాప్తంగా రీ-రిలీజ్ (Re-Release) చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఈ చిత్రాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడటం అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా నరసింహ సినిమా థియేటర్లలోకి తిరిగి రాబోతోంది. 1999లో విడుదలైన నరసింహ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డుల సునామీ మామూలుది కాదు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, రజనీకాంత్‌ను ఒక స్టైలిష్ ఫ్యామిలీ మ్యాన్ తగ్గేదేలే అనే రేంజ్‌లో చూపించారు. దీనికి తోడు ఈ సినిమాలోని పాటలు, పవర్‌ఫుల్ నెగిటివ్ పాత్రలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఈ సినిమా కథ, మాటలు, గెటప్స్, ముఖ్యంగా రజనీ చెప్పే పంచ్ డైలాగ్స్ అన్నీ యూత్‌ను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకున్నాయి. రీ-రిలీజ్ సందర్బంగా, సరికొత్త 4K డిజిటల్ ప్రింట్‌తో మరియు డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుండటంతో, అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రజనీకాంత్ పుట్టినరోజు నాడు ఆయన మాస్ ఎనర్జీని పెద్ద తెరపై మళ్లీ చూడటం, తోటి అభిమానులతో కలిసి ఆయన స్టైల్‌కి, స్పీడ్‌కి కేకలు వేయడం ఒక అపురూపమైన అనుభూతే. రజనీ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. ఈ ప్రస్థానంలో నరసింహ సినిమా ఒక ట్రేడ్‌మార్క్ లాంటిది. కొత్త సినిమా రిలీజ్‌కు ఏమాత్రం తగ్గని విధంగా, నరసింహా రీ రిలీజ్‌ను భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ రికార్డులను బ్రేక్‌చేస్తుందో లేదో చూడాలి.