Rajinikanth: రెండు రూపాయలు ఇచ్చి.. బాధ కలిగించేలా మాట్లాడాడు..
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:02 PM
బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్, తలైవా అని పిలిపించుకునే స్థాయికి చేరుకున్నారు రజినీకాంత్. కెరీర్ బిగినింగ్‌లో మాత్రం ఆటుపోట్లు అవమానాలు అన్నీ అనుభవించారాయన.
బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్, తలైవా అని పిలిపించుకునే స్థాయికి చేరుకున్నారు రజినీకాంత్. కెరీర్ బిగినింగ్‌లో మాత్రం ఆటుపోట్లు అవమానాలు అన్నీ అనుభవించారాయన. గతంలో జరిగిన ఓ సంఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. ఓ సమయంలో కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, ఆ తర్వాత అటు పక్క వ్యక్తి అన్న మాటలకు ఎంతో బాధపడ్డానని రజనీకాంత్ అన్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన కీలక పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బ?ంగా శనివారం చెన్నైలో ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ ‘ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే ఓ వ్యక్తి నన్ను పిలిచి, ‘నా లగేజ్‌ను టెంపో వరకూ తీసుకెళ్తావా’ అని అడిగాడు. నేను సరేనన్నాను. అతన్ని పరిశీలించి చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. కొన్ని క్షణాల తర్వాత తను నేనూ ఒకే కాలేజ్‌లో చదువుకున్నామని అర్థమైంది. అప్పట్లో అతడిని నేను సరదాగా ఏడిపించేవాడిని. అతని లగేజ్ టెంపో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ.2 చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు. ‘అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు. నీకు ఆ రోజులు గుర్తున్నాయా?’ అని అడిగాడు. నాకు కన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో ఎంతో బాధ పడిన సందర్భం అది’ అని రజినీ పాత జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు. ఇంకా మాట్లాడుతూ ‘కూలీ’ చిత్రానికి దర్శకుడిగా పని చేసిన లోకేశ్ కనగరాజ్‌ు రియల్ హీరో. ఈ మూవీపై అంచనాలను భారీ లెవల్‌కి తీసుకెళ్లారు. సక్సెస్‌ఫుల్ కమర్షియల్ దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో నటీనటులతో ఒక తుపాను సృష్టించాడు. లోకేశ్ ఈ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ‘నేను కమల్ ఫ్యాన్ సర్’ అన్నాడు. ‘నేను నిన్ను అడిగానా’ అన్నాను. ‘లేదు సర్. మామూలుగా చెప్పాను’ అన్నాడు. ‘ఈ స్టోరీలో పంచ్ డైలాగ్‌లు ఉండవు’ అని ముందే చెప్పాడు. ఇదొక ఇంటెన్సిటీ డ్రామా అని అప్పుడే అర్ధమైంది’ అని రజనీకాంత్ తెలిపారు.
రజినీ సర్ పేరు ఉంది.. అది చాలు: ఆమిర్‌ఖాన్
ఇదే వేదికపై ఉన్న ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ ‘లోకేశ్ నన్ను కలిసినప్పుడు కథ, రిలీజ్ డేట్ గురించి ఆయన్ను అడగలేదు. ఎందుకంటే ఇది రజనీసర్ సినిమా. అంతకుమించిన అంశం ఇంకేముంటుంది. ‘షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నాం’ అని మాత్రమే లోకేశ్‌ను అడిగాను. మంచి సినిమా అవుతుందని చెప్పగలను’ అన్నారు. నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించారు.