Rajinikanth: మజ్దూర్ గా హిందీలో కూలీ...

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:36 PM

రజనీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు హిందీలో 'మజ్దూర్' అనే పేరు పెట్టడంతో అక్కడి వారు పెదవి విరుస్తున్నారట.

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టైల్ కు ఉత్తరాది ప్రేక్షకులు సైతం సాహో అనేస్తారు. అయితే కొంతకాలంగా రజనీకాంత్ సినిమాలేవీ హిందీలో పెద్దంతగా ఆడటంలేదు. బట్... 'జైలర్' (Jailer) వంటి సినిమా అందుకు మినహాయింపు. సౌత్ లోనే కాదు నార్త్ తోనూ ఆ సినిమా దుమ్ము రేపింది.


ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)... రజనీకాంత్ తో పాన్ ఇండియా మూవీగా 'కూలీ'ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కింగ్ నాగార్జునతో పాటు కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర, ఉత్తరాది స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'కూలీ' సినిమాకు దక్షిణాదిన మంచి క్రేజ్ ఏర్పడింది. అది రజనీకాంత్ తో పాటు దర్శకుడు లోకేష్‌ కు ఉన్న పేరు కారణంగానే! అయితే... ఉత్తరాదిన మాత్రం 'కూలీ'కి నెగెటివ్ ప్రచారం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిందీలో 'మజ్దూర్' పేరుతో విడుదల చేయాలని మేకర్స్ భావించారట. అయితే 'కూలీ' అనే పదంలో ఉన్న ఫోర్స్ 'మజ్దూర్'లో లేదని కొందరు అంటున్నారు.


నిజానికి 'కూలీ' అనే పేరు హిందీలోనూ పాపులరే. కాకపోతే అప్పట్లో 'కూలీ' పేరుతోనే సినిమా చేస్తూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీవ్ర గాయలకు లోనయ్యారు. చావు అంచుల వరకూ వెళ్ళి తిరిగి వచ్చారు. అప్పటి నుండీ 'కూలీ' అనే టైటిల్ ను సదరు ప్రొడ్యూసరే అట్టే పెట్టుకున్నాడట. అందుకే 'కూలీ' అనే టైటిల్ లభించకపోవడంతో ఇప్పుడు అక్కడ 'మజ్దూర్' అనే పేరు పెట్టారని తెలుస్తోంది. నిజానికి మన దర్శక నిర్మాతలు ఒక్కోసారి ఇలాంటి పేర్లు లభించకపోవతే... దానికి ముందు 'రజనీకాంత్ కూలీ' అనో 'లోకేశ్‌ కనకరాజ్ కూలీ' అనే పెట్టేస్తుంటారు. మరి ఆ ప్రయత్నం వీళ్ళెందుకు చేయలేదో తెలియదు. ఏదేమైనా... కేవలం టైటిల్ కారణంగానే సినిమాకు నెగెటివ్ టాక్ వస్తోందంటే నమ్మశక్యంగా లేదని కొందరు చెబుతున్నారు. 'కూలీ' ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అదే రోజున హిందీలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నుండి 'వార్ 2' వస్తోంది. ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ తన పథక రచనలో భాగంగా 'కూలీ'ని తక్కువ చేసి చూపిస్తోందా? అనే అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా... రజనీకాంత్ మూవీ ఒక్కసారి జనాలకు పట్టిందంటే... అది దావానలంలా వ్యాపించేస్తుంది. పైగా 'కూలీ'ని తెరకెక్కిస్తోంది లోకేశ్‌ కనకరాజ్ కాబట్టి... భయపడాల్సింది ఏమీ లేదని రజనీకాంత్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!?

Also Read: NTR Family: శ్రీకృష్ణ పాత్రతో రాజయోగం ఖాయం...

Also Read: M. S. Viswanathan: సంగీత ప్రియులను అలరించిన స్వర విన్యాసం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 25 , 2025 | 12:36 PM