Rajinikanth: బాషాకు మార్క్ ఆంటోనీ - కూలీకి సైమన్
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:14 PM
లోకేశ్ కనకరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు సూపర్‌స్టార్ రజనీకాంత్ . ఆయన్ను రాజమౌళితో పోల్చి చెప్పారు.
రాజమౌళి, లోకేష్ ఒకటే..
ఇద్దరు పరాజయం తెలియని దర్శకులు..
సైమన్ పాత్ర నేనే చేయాలనేంత ఇన్‌స్పైర్ చేసింది..
నాగార్జున గ్లామర్ సీక్రెట్ అదే..
నాకు జుట్టు ఊడిపోయింది.. ఆయన మాత్రం అలాగే ఉన్నారు..
- వీడియో బైట్‌లో రజనీకాంత్
లోకేశ్ కనకరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన్ను రాజమౌళితో పోల్చి చెప్పారు. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టే. పరాజయం తెలియని దర్శకుడు’ అని రజనీకాంత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. ఆ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రజనీకాంత్ స్పెషల్ వీడియోతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
ఆయన మాట్లాడుతూ ‘లోకేశ్ కనగరాజ్‌తో చేసిన ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న రావడం సంతోషంగా ఉంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్టే. మరో గొప్ప విషయం ఏంటంటే, ఇందులో పలువురు స్టార్ హీరోలు నటించారు. చాలా ఏళ్ల తర్వాత సత్యరాజ్‌తో సినిమా చేస్తున్నా. శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్‌లతోపాటు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ గెస్ట్ అపియరెన్స్ ఉంది. ఇందులో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. ‘కూలీ’ సబ్జెక్ట్ విన్న వింటనే సైమన్ పాత్ర నేనే చేయాలనేంత ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా? అని చూశా. ఎందుకంటే చాలా స్టైలిష్ క్యారెక్టర్ అది. దానికి సూటయ్యే ఆర్టిస్ట్ దొరికితేనే ఆ పాత్ర పండుతుంది. 'ఆరు నెలలు ప్రయత్నం చేశాం. ఒక నటుడితో ఆరుసార్లు చర్చలు జరిగాయి. అయినా ఓకే అవలేదని లోకేశ్ నాతో చెప్పారు. ‘ఎవరు ఆయన’ అని నేనే అడిగా. నాగార్జున పేరు చెప్పగానే వండర్ అయ్యా. ఆ తర్వాత ఆయన ఒప్పుకొన్నారని తెలిసి సంతోషించా. ఎందుకంటే, డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు ఆయన. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా? అని కొత్తగా ట్రై చేయాలనీ సైమన్ పాత్రకు ఒప్పుకొని ఉంటారు.
మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమా చేశాం. నాకు జుట్టు ఊడిపోయింది. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. షూటింగ్‌లో ‘మీ ఆరోగ్య రహస్యం ఏంటి’ అని నాగార్జునను అడిగా. ‘ఏమీ లేదు సర్.. వ్యాయామం, ఈత, కొద్దిగా డైట్. ఈవెనింగ్ 6 గంటలకు డిన్నర్ అయిపోతుంది. నా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం. దాంతోపాటు, నా తండ్రి నాకో సలహా ఇచ్చారు. ‘బయట విషయాలని తలలోకి ఎక్కించుకోవద్ద’ని చెప్నారు’ అని నాగార్జున నాతో చెప్పారు. 17 రోజుల షెడ్యూల్ కోసం ఇద్దరం థాయ్‌లాండ్ వెళ్లాం. అది నా జీవితంలో మర్చిపోను. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్ అలా ఉంటుంది’ అని వీడియో ద్వారా రజినీ చెప్పుకొచ్చారు.