Raghava Lawrence: కష్టపడిన సొమ్ము చెదల పాలైతే.. లారెన్స్ ఏం చేశాడంటే
ABN, Publish Date - May 08 , 2025 | 08:16 PM
రాఘవ లారెన్స్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. పేదలకు సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఓ పేద కుటుంబానికి డబ్బు సాయం చేసి ఆదుకున్నారు.
రాఘవ లారెన్స్ (raghava lawrence) మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. పేదలకు సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఓ పేద కుటుంబానికి డబ్బు సాయం చేసి ఆదుకున్నారు. ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా అభిమానులతో షేర్ చేశారు.
అసలు విషయం ఏంటంటే.. శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, అతని భార్య ముత్తుకరుప్పి(30) దినసరి కూలీలు. వారికి ముగ్గురు పిల్లలు. కూలికి వెళ్లి సంపాదించిన నగదును డబ్బాలో పొదుపు చేేసవారు. అలా కొన్ని రోజులపాటు సంపాదించిన డబ్బును హుండీలో వేసి ఇంట్లో గొయ్యి తవ్వి పాతి పెట్టారు. పిల్లలు చెవిపోగులు వేడుకల కోసం పొదుపు చేసిన నగదును కొద్ది నెలలు ముందు లెక్కించగా రూ.లక్ష ఉన్నట్లు తెలిసింది. మరికొంత పొదుపు చేయాలని మళ్లీ హుండీని పాతిపెట్టారు. ఇటీవల హుండీని బయటకు తీసి చూడగా చెద పురుగులు లోపలికి వెళ్లి రూ.500 నోట్లను కొంతమేర తినేశాయి. కష్టపడి సంపాదించిన సొమ్ము చెద పురుగులు పాలవడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న లారెన్స్ ఆ కుటుంబానికి సాయం అందించారు. చెదలు తినేసిన రూ.లక్షను వారికి అందించి ఆశ్చర్యపరిచారు.
‘కూలి చేసుకునే కుటుంబం కష్టపడి సంపాదించిన డబ్బులు చెదలు తినేసిన వార్త నా దృష్టికి వచ్చింది. వారి బాధ నా హృదయాన్ని కలచి వేసింది. వాళ్లు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి అందించడం ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని నా వరకూ తీసుకొచ్చిన మీడియా, ప్రజలకు ధన్యవాదాలు’’ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.