Rajinikanth: తెలుగులోనూ వచ్చిన పవర్ హౌస్ సాంగ్...
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:12 PM
రజనీకాంత్ 'కూలీ' నుండి థర్డ్ సింగిల్ గా పవర్ హౌస్ పాట విడుదలైంది. ఇప్పటికే తమిళంలో విడుదలై, విజయం సాధించిన ఈ గీతం ఇప్పుడు తెలుగులోనూ వచ్చింది.
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikantha) దశ 'జైలర్' (Jailer) మూవీ నుండి తిరిగిపోయింది. సీనియర్ స్టార్ హీరోలు సైతం రికార్డులను బద్దలు కొట్టగలరని రజనీకాంత్ 'జైలర్'తోనూ, కమల్ హాసన్ (Kamal Haasan) 'విక్రమ్' (Vikram) తోనూ నిరూపించారు. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' (Lal Salam) విడుదలై పరాజయం పాలు అయినా... అందులో రజనీకాంత్ పోషించింది ప్రత్యేక పాత్ర కావడంతో ఆ పరాజయాన్ని ఆయన ఖాతాలో ట్రేడ్ వర్గాలు వేయలేదు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి 'కూలీ' (Coolie) మీద పడింది. పరాజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దీనికి దర్శకుడు కావడం కూడా అందుకు కారణం. దక్షిణాదికి చెందిన వివిధ భాషల హీరోలతో పాటు ఉత్తరాది వాడైన ఆమీర్ ఖాన్ (Aamir Khan) సైతం ఇందులో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడు. దాంతో సహజంగానే 'కూలీ' మీద అంచనాలు పెరిగాయి. ఆగస్ట్ 14న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ప్రచారాన్ని వేగం వంతూ చేయడంలో భాగంగా ఆగస్ట్ 2న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపింది.
ఇదిలా ఉంటే... 'కూలీ' చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోని పవర్ హౌస్ సాంగ్ ఇప్పటికే తమిళ వర్షన్ విడుదలై చార్ట్ బస్టర్స్ లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఈ పాట తెలుగు వర్షన్ ను సైతం రిలీజ్ చేశారు. ఈ పాటను తెలుగులో రవీంద్ర గోసాల రాశారు. అరివు పాడారు. 'కూలీ' నుండి వచ్చిన మూడో పాట ఇది. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న 'కూలీ' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.