Tollywood: పవన్ నిర్ణయం.. తెలుగు నిర్మాతలు జై
ABN , Publish Date - Sep 30 , 2025 | 07:42 PM
'కాంతార చాప్టర్ 1' సినిమా టిక్కెట్ రేట్లను పెంచడం విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు నిర్మాతలు స్వాగతిస్తున్నారు. కళకు సరిహద్దులు లేవని పవన్ మరోసారి నిరూపించారని అంటున్నారు. ఇదే గౌరవాన్ని కర్ణాటక ప్రభుత్వం తెలుగు సినిమాలకూ ఇవ్వాలని కోరుతున్నారు.
తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నా... స్వయంగా తన సినిమాలు 'హరిహర వీరమల్లు (Harihara Veeramallu), ఓజీ (OG)'లకు స్థానిక పంపిణీదారులు, ప్రభుత్వం నుండి ఇబ్బందులు కలిగినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'కాంతార చాప్టర్ 1' విషయంలో పెద్దమనసు చాటుకోవడం పలువురిని ఆకట్టుకుంది. కొంతమంది సినిమా అభిమానులు తెలుగు నిర్మాతలను ఇబ్బంది పెట్టిన కర్ణాటక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, 'కాంతార: చాప్టర్ 1' (Kanthara Chapter 1) సినిమాను ప్రోత్సహించవద్దని కోరారు. సోషల్ మీడియాలోనూ 'కాంతార' ను బాయ్ కాట్ చేయాలంటూ పోస్టులు పెట్టారు.
అయితే... మంచి మనసుతో జాతీయ భావనలతో ఆలోచన చేయాలని పవన్ కళ్యాణ్ వైఖరిని అగ్ర నిర్మాతలు ఇప్పుడు స్వాగతిస్తున్నారు. తెలుగు నిర్మాతలు సైతం దీన్ని బలపరుస్తున్నారు. ఏపీలో 'కాంతార చాప్టర్ 1' సినిమా టిక్కెట్ రేట్లను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి... విడదీయకూడదు అన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా. రాజ్ కుమార్ (Dr Rajkumar) గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్ (Sudeep), ఉపేంద్ర (Upendra), శివరాజ్ కుమార్ (Sivaraj Kumar), రిషబ్ శెట్టి (Rishabh Shetty) వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని 'కాంతార ఛాప్టర్ 1' కి ఆటంకాలు కల్పించవద్దు' అని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandual Durgesh) ను అభినందించింది. ఇండియన్ సినిమాను గౌరవిస్తూ, సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించేలా వారి నిర్ణయం ఉందని ప్రశంసించింది. అలానే సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు చెందిన సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) సైతం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళలకు సరిహద్దులు ఉండవని, నిజమైన కళ రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా అందరినీ కలుపుతుందని అన్నారు.
మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నడ సినిమా రంగానికి ఇచ్చిన గౌరవానికి ప్రతిగా అక్కడి ప్రభుత్వం కూడా త్వరలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాల విషయంలోనూ అదే గౌరవాన్ని ప్రదర్శిస్తుందేమో చూడాలి.