Bhagya Raja: తమిళంలో పేర్లు పెట్టకపోవడం.. భాషను దూరం చేయడం కాదు

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:24 PM

సినిమాలకు తమిళంలో పేర్లు పెట్టకపోవడం మాతృభాషను ప్రజలకు దూరం చేసినట్టు కాదని దర్శక నిర్మాత కె.భాగ్యరాజ్ అభిప్రాయపడ్డారు.

Bhagya Raja

సినిమాలకు తమిళంలో పేర్లు పెట్టకపోవడం అంటే మాతృభాషను ప్రజలకు దూరం చేసినట్టు కాదని, ప్రజలకు నచ్చింది చేయడమే మన కర్తవ్యమని సీనియర్‌ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత కె.భాగ్యరాజ్ (Bhagya Raja) అభిప్రాయపడ్డారు. ఇటీవ‌ల ఓ సినిమా కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా కె.భాగ్యరాజ్‌, సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌తో పాటు చిత్ర బృందం, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.రాజన్‌ మాట్లాడుతూ, ‘చిత్రాలకు తమిళంలో పేర్లు పెట్టి, మాతృభాషను ప్రజలకు మరింత దగ్గర చేయాలి. తమిళంలో పేర్లు పెట్టే చిత్రాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాలి’ అని కోరారు.

అనంత‌రం కె.భాగ్యరాజ్ (Bhagya Raja) మాట్లాడుతూ, గతంలో నేను పలు చిత్రాలకు ఆంగ్లంలో పేరు పెట్టాను. హిందీ పాట కూడా పాడాను. ఇదంతా ప్రేక్షకుల కోసమే చేశాను. ప్రజలకు నచ్చింది చేయడమే మన కర్తవ్యం. తమిళంలో పేర్లు పెట్టకపోవడం ద్వారా భాషను వారికి దూరం చేయాలన్న ఉద్దేశ్యం కాదు. మనల్ని పోషిస్తున్నది తమిళమే. మంచి సినిమా తీస్తే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ చిత్ర విజయాన్ని ఎవరూ ఆపలేరు. దీనికి మంచి ఉదాహరణే.. ఇటీవల వచ్చిన ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. ఆ చిత్ర దర్శకుడు అభిషన్‌ జీవింత్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:24 PM