Rajini Kamal: రజనీ, కమల్ కాంబో ఫిక్స్.. స్పష్టం చేసిన వారసులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:55 AM
రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? దర్శకుడు ఎవరు? అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. మొదట్లో ఈ ప్రాజెక్టుకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ పేరు విన్పించింది. కానీ తాను డైరెక్ట్ చేయడం లేదని ప్రదీప్ తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అన్న అనుమానాలు అభిమానుల్లో కలిగాయి.
అయితే రజనీకాంత్ కూతురు సౌందర్య, కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ఇద్దరు వెల్లడించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ.. రజనీ,కమల్ కాంబోలో మాత్రం కచ్చితంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తారని స్పష్టం చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలసి నటిస్తే చూడాలనే ఆశ తమకూ ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి, వివరాలను వారే త్వరలో స్వయంగా వెల్లడిస్తారు అని సౌందర్య, శృతిహసన్ తెలిపారు.

ఆ మధ్య సైమా అవార్డుల వేడుకలో కూడా కమల్ హాసన్ ఈ విషయంపై స్పందించారు. ‘ప్రేక్షకులు మా కాంబినేషన్‌ని ఇష్టపడితే మంచిదే కదా, వారు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే. మేమిద్దరం కలసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు కలసి రానున్నాం’ అని అన్నారు. కాగా, వీరిద్దరూ కెరీర్ తొలినాళ్లలో ‘అపూర్వ రాగంగళ్’, ‘మూండ్రు ముడిచ్చు’, ‘అంతులేని కథ’ వంటి హిట్ చిత్రాలతోపాటు సుమారు ఇరవైకి పైగా చిత్రాల్లో కలసి నటించారు. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీ, కమల్ కలసి నటించలేదు.
అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి సూపర్‌స్టార్ల కలయికలో రానున్న ఈ చిత్రానికి జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకుడిగా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు లోకేశ్ కనగరాజ్ పేరు పదే పదే ప్రస్తావన వచ్చినప్పటికీ చివరకు నెల్సన్ తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీతో చేస్తున్న జైలర్2 పూర్తి అయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.