Tollywood: సెకండాఫ్ లో పాన్ ఇండియా మూవీస్ హంగామా
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:36 PM
ఫస్ట్ హాఫ్ లో పరమానందం పంచలేక పోయిన మన సినిమా సెకండాఫ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కొందరంటున్నారు. ఎందుకంటే ద్వితీయార్ధంలోనే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేయనున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం...
ప్రస్తుతం సినీఫ్యాన్స్ చూపు. పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'వైపు సాగుతోంది. ఎందుకంటే పవర్ స్టార్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'హరిహర వీరమల్లు' జూలై 24న రాబోతోంది. ఆల్ ఇండియా లెవెల్లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాలే అలరించిన రోజులున్నాయి. అలా కాకుండా ఇప్పుడు నార్త్ లో హిందీలోనూ, సౌత్ లో తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అందువల్ల అన్ని ఏరియాల్లోనూ 'హరిహర వీరమల్లు'కు మంచి వసూళ్ళే వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీయమ్ హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం అన్నది పొలిటికల్ ఎరీనాలోనూ ఓ స్పెషల్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వస్తోన్న 'హరిహర వీరమల్లు'తోనే తెలుగువారు నటించిన పాన్ ఇండియా మూవీస్ కు క్రేజ్ స్టార్ట్ అవుతుందనీ సినీ ఫ్యాన్స్ అంటున్నారు.
'హరిహర వీరమల్లు' తరువాత వస్తోన్న పాన్ ఇండియా మూవీ ఏదంటే యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ 2'. ఇందులో యన్టీఆర్ నటించడం వల్లే సౌత్ లాంగ్వేజెస్ లో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.ఈ చిత్రం ఆగస్టు 14న జనం ముందుకు రానుంది. ఇదే తేదీన రజనీకాంత్ తో మన తెలుగు స్టార్ హీరో నాగార్జున నటించిన 'కూలి' కూడా విడుదలవుతోంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. సెప్టెంబర్ 5 వ తేదీన యంగ్ హీరో తేజ సజ్జా నటించిన 'మిరాయి' పాన్ ఇండియా మూవీగా రానుంది. ఇక సెప్టెంబర్ లోనే నటసింహ బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీగా 'అఖండ-2' వస్తోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న 'అఖండ-2'తో పాటే పవన్ కళ్యాణ్ మరో పాన్ ఇండియా మూవీ 'ఓజీ' కూడా రానుందని తెలుస్తోంది.ఈ రెండు సినిమాలపై బాలయ్య ఫ్యాన్స్ లోనూ, పవన్ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి.
అక్టోబర్ లో తెలుగు స్టార్స్ నటించిన ఏ పాన్ ఇండియా మూవీ రావడం లేదు. అయితే తెలుగునాట సైతం విశేషాదరణ పొందిన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్ గా 'కాంతార- చాప్టర్ 1' అక్టోబర్ 2న విడుదల కానుంది. నవంబర్ లో ఇప్పటి దాకా ఏ లాంటి పాన్ ఇండియా మూవీ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇక డిసెంబర్ కు వచ్చే సరికి ఆ నెల 5వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ 'ద రాజాసాబ్' జనం ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. క్రిస్మస్ స్పెషల్ గా అడివి శేష్ 'డెకాయిట్' సినిమా రానుంది. ఇలా సెకండాఫ్ లో వచ్చే తెలుగు పాన్ ఇండియా మూవీస్ తప్పకుండా విజయఢంకా మోగిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే పరిశీలకులు సైతం ఈ సినిమాలు తప్పకుండా వసూళ్ళ వర్షాలు కురిపిస్తాయని చెబుతున్నారు. ఈ యేడాది ఫస్టాఫ్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీస్ "హిట్-3, తండేల్, కుబేర, కన్నప్ప" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయాయి. మరి సెకండాఫ్ లో వస్తోన్న తెలుగువారి పాన్ ఇండియా మూవీస్ ఏ రేంజ్ లో అలరిస్తాయో చూద్దాం.
Also Read: Vijay Devarakonda: స్టంట్స్ చేసింది విజయ్ కాదా...
Also Read: Andhra King Taluka: నువ్వుంటే చాలే.. రామ్ రాసిన పాట విన్నారా