Mohan Lal: సమస్య వస్తే దానికి అధ్యక్షుడు ఒక్కడే కారణమా..
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:50 PM
మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ-AMMA) అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ (Swetha menon) ఎన్నికైన సంగతి తెలిసిందే! ఆమెకు ముందు ‘అమ్మ’ అధ్యక్షుడిగా మోహన్‌లాల్ (Mohan lal) ఉన్నారు.
మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ-AMMA) అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ (Swetha menon) ఎన్నికైన సంగతి తెలిసిందే! ఆమెకు ముందు ‘అమ్మ’ అధ్యక్షుడిగా మోహన్‌లాల్ (Mohan lal) ఉన్నారు. పలు కారణాల వల్ల ఆయన రాజీనామా చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్ హేమ కమిటీ గతేడాది ఓ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కేరళ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదికలో హేమ కమిటీ పేర్కొంది. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అప్పటి అధ్యక్షుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి మొత్తం కమిటీ నుంచి వైదొలగింది. అందుకు దారి తీసిన పరిస్థితులను గురించి తాజాగా ఓ వేదికపై ఆయన మాట్లాడారు. (AMMA president)
‘అధ్యక్షుడు అనేది కేవలం ఒక పదవి. ఏదైనా సమస్య వస్తే దానికి అధ్యక్షుడు ఒక్కడే కారణమా? చాలామంది నాపై శత్రుత్వం పెంచుకున్నారు. అలా అని అందరూ నన్ను ద్వేషించారని నేను చెప్పడం లేదు. ఏదేమైనా నన్ను శత్రువులా ఎందుకు చూస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాతోపాటు రాజీనామా చేసిన ఇతర వ్యక్తులు తిరిగి తిరిగీ కమిటీలోకి వస్తారా, లేదా అనేది పూర్తిగా వారి నిర్ణయం. అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్‌ను ఎన్నుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే గతంలో మహిళలు చర్చించలేకపోయిన విషయాలు ఇప్పుడు వారు సంకోచం లేకుండా చర్చించుకోవచ్చు. ‘అమ్మ’కు సపోర్ట్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్థంగానే ఉంటాను’’ అని అన్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌కు నాయకత్వం వహించడానికి యువకులు ఎందుకు ముందుకురావడం లేదనే ప్రశ్నకు మోహన్‌లాల్ సమాధానమిచ్చారు. ‘యువకులు ముందుకురావాలని మనం అనుకుంటే సరిపోదు. వారు బాధ్యత తీసుకోవడానికి సిద్థంగా ఉండాలి. బహుశా వారికి అంత సహనం లేదేమో’ అని అన్నారు. (Mohanlal AMMA resignation)