Mohanlal: మలయాళ సినిమాకు వచ్చిన పురస్కారమిది..
ABN , Publish Date - Sep 21 , 2025 | 02:40 PM
ప్రతిష్ఠాత్మక పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయానని మలయాళ నటుడు మోహన్‌లాల్ అన్నారు.
ప్రతిష్ఠాత్మక పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke Award) అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయానని మలయాళ నటుడు మోహన్‌లాల్ (Mohan Lal) అన్నారు. కలలో ఉన్నానేమో అనుకుని ఆ విషయాన్ని మరోసారి చెప్పమని అడిగానని ఆనందం వ్యక్తం చేస్తున్నారు లాలెట్టన్. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు మోహన్‌లాల్ చేసిన సేవలకుగాను దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మోహన్‌లాల్ మాట్లాడారు. ‘ఈ అవార్డు మలయాళ సినిమాకు వచ్చిన అవార్డు. నిజాయతీగా పని చేయడంతోపాటు భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం దక్కిందనుకుంటున్నా. నన్ను అభిమానించే వారందరికీ ఈ అవార్డు చెందుతుంది. సినిమా తప్ప నాకు పెద్ద డ్రీమ్స్ లేవు’ అని అన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్‌లాల్‌ను అభినుందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, బోనీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, ఎన్టీఆర్, మమ్ముట్టి, మోహన్‌బాబు తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సముచిత గౌరవమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘లెజండరీ మోహన్‌లాల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇండియన్ సినిమా ఐకాన్‌కు తగిన గుర్తింపు ఇది’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు