Mohanlal: మోహన్ లాల్ కే అది సాధ్యం
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:54 PM
మలయాళ సూపర్ స్టార్ కుర్ర హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. చకచకా సినిమాలను ఒప్పుకోవడమే కాదు... అంతకు మించిన వేగంతో వాటిని కంప్లీట్ చేస్తున్నాడు. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు... కుదిరితే మూడు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
మోహన్ లాల్ (Mohanlal)... కుర్ర హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఆరుపదుల వయసులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వగానే... మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్న సూపర్ స్టార్ అదే టెంపోను కొన్నేళ్ళుగా కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికి ఎన్నో వండర్స్ తో పాటు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి వావ్ అనిపించుకున్నాడు. కుర్ర హీరోలకు సైతం సాధ్యం కానీ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాడు.
మొన్నటి కి మొన్న 'ఎల్ 2 ఎంపురాన్' (L2 Empuraan) తో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఎన్నో వివాదాలు చుట్టు ముట్టినా బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే అన్నట్లు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇక రీసెంట్ గా 'తుడరుమ్' (Thudarum)తో వచ్చి బాక్సాఫీస్ కింగ్ గా మారిపోయాడు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి మలయాళంలో మంచి విజయం దక్కింది. తెలుగులోనూ అదే పేరుతో ఈ సినిమా డబ్ అయ్యింది. రీసెంట్ గా కేరళలో మొదటి నాలుగు రోజుల్లోనే అత్యధిక వసూళ్లతో పాటు ఆడియెన్స్ మెప్పు పొందిన సినిమాలు మోహన్ లాల్ వే కావడం విశేషం.
ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో 'ఎల్ 2: ఎంపురాన్' నిలిచింది. ఈ సినిమాను కేవలం నాలుగు రోజుల్లో 25.65 లక్షల మంది వీక్షించారు. రెండో స్థానంలో 'లూసిఫర్' (Lucifer) మూవీ నిలిచింది. మొదటి నాలుగు రోజుల్లో 18.7 లక్షల మంది ఈ సినిమాను చూశారు. ఇక మూడో స్థానంలో రీసెంట్ గా రిలీజైన 'తుడరుమ్' చేరింది. ఈ సినిమాను నాలుగు రోజుల్లో 17 లక్షల మంది వీక్షించారు. ఇలా అత్యధికమంది ప్రేక్షకులు చూసిన మూడు చిత్రాలు మోహన్ లాల్ వే కావడం విశేషం. ఈ మధ్య సినిమాలకు లభిస్తున్న ఆదరణను కేవలం కలెక్షన్స్ తో కాకుండా... ఇలా ఎంత మంది ఆ సినిమాను చూశారు, మొత్తంగా ఎన్ని టిక్కెట్లు తెగాయి అనే దానితో లెక్కలు వేస్తున్నారు. ఆ రకంగా మోహన్ లాల్ సినిమాలు మూడు అగ్రస్థానంలో నిలవడం విశేషమనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ హీరో ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడో చూడాలి.