Bramayugam: ‘భ్రమయుగం’కు.. అరుదైన గుర్తింపు! ప్రపంచ వేదిక పైకి మలయాళ సినిమా
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:44 AM
రెండేండ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘భ్రమయుగం’ ఓ అరుదైన ఘనతను సాధించింది.
మమ్ముట్టి (Mammootty) లీడ్ రోల్‌లో రెండేండ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). హర్రర్ చిత్రాలలోనే నూతన ఓరవడి సృష్టించిన చిత్రం పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెకక్డం విశేషం. కేవలం మూడు పాత్రలు చుట్టే తిరిగే ఈ సినిమా ఆద్యంతం చివరి వరకు సస్పెన్స్, భయానక సన్నివేశాలతో ఓ రకమైన ఫీల్ ఇస్తుంది. మలయాళంతో పాటే తెలుగు ఇతర భాషల్లోనూ విడుదలైన సినిమా ఫర్వాలేదని అనిపించుకుంది. హర్రర్ చిత్రాల్లోనే ఓ డిఫరెంట్ ప్రయత్నంగా నిలిచిపోయింది.
అంతేగాక.. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో నాలుగు విభాగాల్లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన ‘భ్రమయుగం’ (Bramayugam) మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సారి ప్రపంచ సినిమా వేదికపై మెరిసేందుకు సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’(Academy Museum of Motion Pictures) లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శన లభించింది. ఈ స్క్రీనింగ్ ఫిబ్రవరి 12, 2026న జరుగనుంది. “Where the Forest Meets the Sea: Folklore from Around the World” అనే ప్రపంచ జానపద చిత్రోత్సవం (Global Folklore Film Series)లో భాగంగా ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమం జనవరి 10 నుండి ఫిబ్రవరి 12 వరకు కొనసాగుతుంది.
రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కేరళ జానపద కథ నేపథ్యంలో భయం, అధికారం, మానవ బలహీనతలను హృద్యంగా ఆవిష్కరించింది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కథనం, విజువల్ ప్రెజెంటేషన్, సాంకేతిక నైపుణ్యం కారణంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి కొడుమోన్ పోట్టి పాత్రలో జీవించేశాడు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్ (Rahul Sadasivan) తాజాగా మోహన్‌లాల్ (Mohanlal) కుమారుడు ప్రణవ్ (Pranav Mohanlal)తో కలిసి 'డీయస్ ఈరే' (Dies Irae) అనే మరో డిఫరెంట్ హరర్ర్ చిత్రం తెరకెక్కించగా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకు పోతుంది. తెలుగులోనూ నవంబర్ 7 శుక్రవారం రోజున ప్రజల ముందుకు వచ్చింది.