లైంగికంగా వేధించాడు.. మరోసారి ఖుష్బూ ఆవేదన
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:20 PM
తన తండ్రి లైంగికంగా వేధించాడని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ(Khushboo Sundar). తాజాగా ఇదే విషయంపై మరోసారి ఘాటుగా స్పందించారు.
తన తండ్రి లైంగికంగా వేధించాడని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ(Khushboo Sundar). తాజాగా ఇదే విషయంపై మరోసారి ఘాటుగా స్పందించారు. తండ్రి వల్ల తన కుటుంబంలో ఎన్నో సమస్యలు చూసిందని అన్నారు. ‘‘చిన్నతనంలోనే నేను లైంగిక దాడిని ఎదుర్కొన్నా. నా తండ్రే నాపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. నా తల్లి, సోదరులను చిత్రహింసలు పెట్టేవాడు. బెల్టు, చెప్పులు, కర్ర.. ఇలా చేతికి ఏది దొరికితే దానితో కొట్టేవాడు. అమ్మను మరీ దారుణంగా హింసించేవాడు. ఆమె తలను గోడకు కొట్టేవాడు. చిన్నతనంలోనే నేను ఇలాంటి దారుణమైన వేధింపులు చూశా. నాపై జరుగుతున్న దాడి గురించి బయటకు చెబితే వాళ్లను ఇంకెంత నరకయాతనకు గురి చేస్తాడోనని భయపడేదాన్ని.. అందుకే మొదట్లో ఏమీ మాట్లాడలేక ఎన్నో దారుణాలు భరించచా. చెన్నైకు వచ్చి నా కాళ్లపై నేను నిలబడిన తర్వాత నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ తర్వాతే ఆయనకు ఎదురు తిరగడం మొదలుపెట్టాను. దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. షూట్‌కు వచ్చి అందరిముందు నన్ను బాగా కొట్టేవాడు. ఉబిన్ అనే ఒక హెయిర్‌డ్రెస్సర్ నాకెంతో సాయం చేసింది. నాతో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని ఆమె గుర్తించింది. ఆమె నాకు ధైర్యం చెప్పింది. అలా మొదటిసారి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లైంగిక వేధింపులు (sexually abuse) గురించి బయటకు వచ్చి మాట్లాడా. ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదు. నేను కనుక్కోవాలనుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన్ని కలవలేదు. గతేడాది ఆయన మరణించాడని తెలిసినవాళ్లు చెప్పారు’’ అని ఖుష్బూ అన్నారు.