Karthi: అనుకున్నంతా అయ్యింది... సినిమా ఆగింది...

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:38 PM

ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా కార్తీ తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' సైతం ఆగిపోయింది. నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా పాత బకాయిలు తీర్చుకుండా ఈ సినిమా విడుదల చేయడానికి ఆస్కారం లేదంటూ మద్రాస్ హైకోర్ట్ తీర్పు ఇచ్చిందని చెన్నయ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Annagaru Vastharu Movie

కార్తీ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా 'వా వాతియార్'. ఇప్పటికే పలు దఫాలు వాయిదా పడిన ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా తెలిపారు. దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాకు 'అన్నగారు వస్తారు' అని పేరు పెట్టడంతో మొదలు పెట్టి... ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకూ మంచి బజ్ క్రియేట్ చేశారు. కార్తీ తో పాటు కృతీశెట్టి సైతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. రెండు రోజుల ముందుకు కూడా యంగ్ హీరో సందీప్ కిషన్ తో కార్తీ స్పెషల్ ఇంటర్వ్యూను మేకర్స్ రిలీజ్ చేశారు. 'సూదు కవ్వమ్' ఫేమ్ నలన్ కుమార స్వామి ఎనిమిదేళ్ళ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో అటు తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి క్రేజే వచ్చింది.


ఇటీవల కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన సినిమాలేవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇప్పుడు 'వా వాతియర్' దానితో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ 'అన్నగారు వస్తారు' కూడా 12న విడుదల కావడం లేదని కోలీవుడ్ సమాచారం. పాత బకాయిలకు సంబంధించి రూ. 21.7 కోట్లను చెల్లించిన తర్వాతే ఈ సినిమాను విడుదల చేయాల్సిందిగా మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కార్తీ గత వారం రోజులుగా చేసిన పబ్లిసిటీ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అయితే... ఈ సినిమా వాయిదా గురించి ఇంకా అధికారికంగా జ్ఞానవేల్ రాజా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Updated Date - Dec 11 , 2025 | 03:04 PM