Kamal Haasan: అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు కమల్.. మీరేమైనా చరిత్రకారులా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:31 PM
విశ్వనాయకుడు కమల్‌హాసన్ పై కర్ణాటక హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే
విశ్వనాయకుడు కమల్‌హాసన్‌పై (Kamal Haasan) కర్ణాటక హైకోర్ట్ (High court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం విడుదలను నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల జరిగిన ‘థగ్ లైఫ్’ (Thug Life) ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై అధికార, విపక్ష పారీలతోపాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో థగ్‌లైఫ్’ సినిమాను కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది.
మంగళవారం ఈ కేసును విచారించిన హైకోర్టు కమల్ హాసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది. కమల్ వ్యాఖ్యలకు ఆధారాలను అడిగింది. ‘ఒక్క క్షమాపణతో సమస్య పరిష్కారమయ్యేదని’ వ్యాఖ్యానించింది. హైకోర్ట్ ఏమందంటే.. ‘‘మీరు కమల్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బ తీయలేరు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే కోరారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారు? మీరు ఏమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా? అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని కమల్‌హాసన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ‘‘క్షమాపణ చెప్పని పక్షంలో కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారు? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటి, ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు కదా. మీరు క్షమాపణ చెబితే ఏ సమస్యా ఉండదు. మీ సినిమాను ప్రదర్శించటం ద్వారా కర్ణాటక నుంచి కూడా మీరు రూ.కోట్లలో ఆదాయాన్ని పొందవచ్చు’’ అని కోర్టు చెప్పింది.
అయితే కమల్ తరఫు న్యాయవాది ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘పరిస్థితుల కారణంగా బాధితుడయ్యే వ్యక్తికీ, వాటిని సృష్టించే వ్యక్తికీ మధ్య చాలా తేడా ఉంది. ఇప్పటికే కమల్‌హాసన్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. దాన్ని మీరు ఇప్పుడు కప్పిపుచ్చలేరు. మిగిలింది క్షమాపణలు చెప్పడమే’ అని కోర్టు వ్యాఖ్యానించగా, కమల్‌హాసన్ పరిస్థితిని చక్కబరిచేందుకే ప్రయత్నించినా, అది పక్కదారి పట్టిందని న్యాయవాది అన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కావచ్చు. కానీ, కారణం ఎవరు? మీరే పరిస్థితి చేయిదాటిపోయేలా చేశారు. ఇప్పుడు మీ సినిమాను రక్షించాలని కోరుతున్నారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.