Kantara Chapter 1: ఇండియ‌న్ సెకండ్ హ‌య్య‌స్ట్.. గ్రాస‌ర్‌గా రికార్డ్‌

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:45 AM

‘కాంతారా చాప్టర్ 1’ ఇప్పుడు బాహుబలి రికార్డులను అధిగమించి, తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది.

Kantara Chapter 1

రిషబ్‌ శెట్టి (rishab shetty) ప్రధాన పాత్రలో, ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 (kantara chapter 1) దేశవ్యాప్తంగా వసూళ్ల తుఫాన్ సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రం విడుద‌లైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్లకు పైగా వసూలు చేస్తూ, బాహుబలి: ది బిగినింగ్ (రూ.650 కోట్లు) రికార్డును అధిగమించింది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీ (రూ.628 కోట్లు) కలెక్షన్లను కూడా దాటేసి, కొత్త మైలురాయిని నమోదు చేసింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 20 చిత్రాల జాబితాలో కాంతారా చాప్టర్ 1 17వ స్థానానికి చేరింది. అలాగే, 2025లో ఇప్పటివరకు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కాంతారా చాప్టర్ 1 రెండో స్థానంలో నిలిచింది. రూ.808 కోట్ల గ్రాస్‌తో ఛావా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.700 కోట్ల గ్రాస్‌ మార్క్‌ దిశగా కాంతారా చాప్టర్ 1 దూసుకెళ్తోండ‌గా రానున్న దీపావ‌ళి చిత్రాల పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ గ‌లిగితే మాత్రం స‌రికొత్త రికార్డులు సాధించడం ఖాయం.

Kantara Chapter 1

ఇదిలాఉంటే.. క‌ర్ణాట‌కు పోటీగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగు వెర్షన్‌దే రూ.95 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. త్వరలోనే రూ.100 కోట్ల మార్క్‌ దాటడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రజనీకాంత్‌, యష్‌ తర్వాత రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన మూడో పరభాషా హీరోగా రిషబ్‌ శెట్టి నిల‌వ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రజనీకాంత్ జైలర్, య‌శ్ కేజీఎఫ్‌ వంటి భారీ అనువాద సినిమాల త‌ర్వాత రిష‌బ్ షెట్టి ఆ జాబితాలో చేరాడు. కేజీఎఫ్ రూ.150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌తో టాప్‌లో ఉండ‌గా జైల‌ర్ కూ.83.50 కోట్ల‌ను అధిగ‌మించి కాంతారా 1 రెండో స్థానంలోకి వ‌చ్చింది. ఇక ఓవ‌ర్సీస్‌, హిందీల‌లో ఓ మోస్త‌రుగా రాణిస్తున్నది.

Updated Date - Oct 15 , 2025 | 11:45 AM