Madenur Manu: కమెడియన్‌పై నటి రేప్ కేసు... అరెస్ట్
ABN , Publish Date - May 23 , 2025 | 12:55 PM
కన్నడలో ‘కామెడీ కిలాడిగళు’ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మడనూరు మనుపై అత్యాచారం, దాడితో పాటు ప్రాణాలు తీస్తామనే బెదిరింపుల కేసు నమోదైంది.
కన్నడలో ‘కామెడీ కిలాడిగళు’ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మడనూరు మనుపై అత్యాచారం, దాడితో పాటు ప్రాణాలు తీస్తామనే బెదిరింపుల కేసు నమోదైంది. ఈ ఘటన బెంగళూరు అన్నపూర్ణేశ్వరీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తోటి నటి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. కన్నడ నాట ప్రజాదరణ పొందిన కామెడీ కిలాడిగళు (Comedy Khiladigalu) అనే కామెడీ షో ద్వారా పేరొందిన మడనూరు మనుకు అదే షోలో పాల్గొనే సహా నటితో 2018 నుంచి పరిచయం ఉంది. అయితే.. 2022 నవంబరు 29న శివమొగ్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను పారితోషికం ఇచ్చేందుకు ఇంటికి పిలిచి అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని అదే ఏడాది డిసెంబరు 3న తన ఇంటికి వచ్చి బలవంతంగా తాళి కట్టినట్లు ఆ నటి అన్నపూర్ణేశ్వరీ నగర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదులో స్పష్టం చేసింది. పలుమార్లు ఇష్టం లేకున్నా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, రెండు సార్లు గర్భస్రావం కూడా చేయించారని తెలిపింది.
నాగరబావిలోని ఓ ఇంట్లో ఉంచి లైంగిక దాడి చేసి మొబైల్‌లో రికార్డు చేసుకుని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని, వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు కేసు స్వీకరించి ఆ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆరెస్టు చేశారు. దీంతో తదుపరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది బుల్లితెర, శాండిల్‌వుడ్ రంగంలో ఉత్కంఠ నెలకొంది. అయితే మనుకు అప్పటికే అప్పటికే పైళ్లై బిడ్డ ఉన్నట్లు ఆ నటి తెలపడం గమనార్హం. ఇదిలాఉంటే మడనూరు మను తాజాగా హీరోగా మారి నటించిన కులదల్లిపై కీళ్యావుదో (Kuladalli Keelyavudo) అనే సినిమా శుక్రవారం విడుదలైంది.