K Bhagya Raj: అభిమానులు లేకుంటే నటీనటులు లేరు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:05 PM
అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే నటీనటులు లేరని, అందువల్ల అన్ని ప్రశంసలు వారికే దక్కాలని సీనియర్ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ (K Bhagya Raja) అన్నారు.
అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే నటీనటులు లేరని, అందువల్ల అన్ని ప్రశంసలు వారికే దక్కాలని సీనియర్ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ (K Bhagya Raja) అన్నారు. ఆర్కే డ్రీమ్ ఫ్యాక్టరీ పతాకంపై టి.రాధాకృష్ణన్ నిర్మాణ సారధ్యంలో ఎస్.కీర్తీశ్వరన్ దర్శకత్వం (Keerthiswaran) వహించి నటించిన ‘నిర్వాగం పొరుప్పల్ల’ (Nirvagam Porupalla Audio Launch) మూవీ ఆడియోను కె.భాగ్యరాజ్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు విరుగంబాక్కం ఎమ్మెల్యే రాజా, దర్శక నటుడు గౌరవ్ నారాయణన్ తదితరులు హాజరయ్యారు. కీర్తీశ్వరన్ రూపొందించిన ఈ చిత్రంలో లివింగ్‌స్టన్, ఇమాన్ అన్నాచ్చి, బ్లాక్ పాండి, రాణా, ఆధవన్, అహల్య వెంకటేశన్, శ్రీనిధి, అమ్మన్‌పురం శరవణన్, రాధాకృష్ణన్, ఎంఆర్ అర్జునన్, మృదులా సురేష్, జయశ్రీ శశిధరన్, మంజు తదితరులు నటించారు.
ఈ సందర్భంగా కె.భాగ్యరాజ్ మాట్లాడుతూ, ‘గతంలో కోలీవుడ్‌లో ఆపద్బాంధవుడుగా శ్రీకాంత్ దేవా తండ్రి దేవా ఉండేవారు. ఇపుడు ఆ పేరును శ్రీకాంత్ దేవా కాపాడుతున్నారు. చిన్న నిర్మాతల పాలిట నిజమైన ఆపద్బాంధువుడుగా సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా ఉన్నారు. ఆయనకు నా అభినందనలు. ఈ సినిమా స్టోరీ ఏంటి? అని దర్శకుడిని అడిగాను.. ‘నేను మోసపోయాను.. అందువల్ల ఇతరులను కూడా నేను మోసం చేయాలని అనుకుంటున్నాను’ అంటూ ఏకవాక్యంతో సమాధానం చెప్పారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. మరో అతిథి గౌరవ్ నారాయణన్ మాట్లాడుతూ, ‘ప్రేక్షకులు ఆదరించిన సినిమా పెద్ద సినిమా.. లేకపోతే అది చిన్న సినిమా. ఇక్కడ హీరోతో పనిలేదు. కంటెంట్ ముఖ్యం. మంచి కథలను మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. దర్శక నిర్మాతలే మంచి కథలతో సినిమాలు తీయలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు.