Vetrimaaran: సెన్సార్ ఎఫెక్ట్.. కంపెనీ మూసేసిన నేషనల్ అవార్డు డైరెక్టర్
ABN , Publish Date - Sep 03 , 2025 | 07:22 AM
దర్శకుడిగా కొనసాగడం చాలా సులభమని, నిర్మాతగా రాణించడం ఎంతో కష్టమని ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ పేర్కొన్నారు.
దర్శకుడిగా కొనసాగడం చాలా సులభమని, నిర్మాతగా రాణించడం ఎంతో కష్టమని ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ (Vetrimaaran) పేర్కొన్నారు. ఆయన నిర్మాతగా గ్రాస్ రూట్ కంపెనీ పతాకంపై నిర్మించిన చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ (Bad Girl) చిత్ర నిర్మాణం ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. దీంతో ఆయన న్యాయ పోరాటం చేసి, సెన్సార్ సర్టిఫికెట్ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర బృందం ఇటీవల ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత వెట్రిమారన్ మాట్లాడుతూ..‘దర్శకుడిగా ఉండటం చాలా సులభం. కానీ, నిర్మాతగా వ్యవహరించడం ఎంతో కఠినం. తాను నిర్మించిన ‘మనుషి’ (Manushi), ‘బ్యాడ్ గర్ల్’ (Bad Girl) మూవీలు సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్నాయి. వాటి నుంచి గట్టెక్కేందుకు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చిత్రాలు నిర్మించడం చాలా కష్టం. అందుకే మా నిర్మాణ సంస్థపై ఇక సినిమాలు నిర్మించను. ‘బ్యాడ్ గర్ల్’ చివరి చిత్రం. ‘గ్రాస్ రూట్ కంపెనీ’ (Grass Root Film Company) మూసి వేస్తున్నాం’ అని వెట్రిమారన్ సభా వేదికగా ప్రకటించారు.
కాగా, వర్షా భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్ర పోషించారు. శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. యుక్తవయసులో ఉన్న ఒక యువతి తాను పెరిగే క్రమంలో ఏర్పడే కోర్కెలు, ఆశలు, కలలను ఏవిధంగా తీర్చుకుంది?, ఆమెను సమాజం ఎలా చూసింది? వంటి అంశాలతో రూపొందింది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ మంజూరు చేయగా, ఈ నెల 5న విడుదలకానుంది.