Ilaiyaraaja: ముదిరిన 'మిసెస్ అండ్ మిస్టర్' వివాదం
ABN , Publish Date - Jul 26 , 2025 | 07:10 PM
'మిసెస్ అండ్ మిస్టరీ' మూవీ వివాదం చినికి చినికి గాలీ వానగా మారింది. తన పాటను అనుమతిలేకుండా వాడుకోవడంపై ఇళయరాజా కోర్టు కెక్కారు. ఆయన పేరును మూవీ ప్రమోషన్స్ నుండి తొలగించినట్టు నిర్మాతలు చెబుతున్నారు.
మాస్ట్రో ఇళయరాజా (Ilayaraaja) కు మద్రాస్ హైకోర్ట్ నుండి కొంత ఊరట కలిగింది. వనితా విజయ్ కుమార్ (Vanitha Vijayakumar) దర్శకత్వం వహించి, నటించిన 'మిసెస్ అండ్ మిస్టర్' మూవీలో తన పాటను అనుమతి లేకుండా ఉపయోగించు కున్నారంటూ కోర్టు ఇళయరాజా ఇటీవల కోర్టు కెక్కారు. దాంతో ఇరుపక్షాల వాదనలను కోర్టు విన్నది. ఈ సందర్భంగా ఇళయరాజా తరఫున లాయర్ మాట్లాడుతూ, 'ఇళయరాజా 'మైఖేల్ మదన కామరాజు' (Michael Madana Kama Rajan) చిత్రం కోసం ట్యూన్ చేసిన 'శివరాత్రి' (Sivarathri) గీతాన్ని ఆయన అనుమతి లేకుండా 'మిసెస్ అండ్ మిస్టర్' (Mrs and Mr) మూవీలో వాడారని, అంతే కాకుండా ఆ సినిమాకు ఆయన సంగీతాన్ని సమకూర్చినట్టుగా ప్రచారంలో పేరు వాడుకున్నార'ని ఆరోపించారు. దీనిపై ఫిల్మ్ మేకర్స్ స్పందిస్తూ, ఈ పాట హక్కుల్ని సోనీ మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్స్ (Sony Music Entertainment) సంస్థ నుండి తీసుకున్నామని వారు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో ఈ మూవీకి సంబంధించిన ప్రచారంలో ఇళయరాజా పేరును తాము తీసేశామని కోర్టుకు తెలిపారు. అయితే ఈ సినిమా జులై 11న విడుదలైంది.
ఇదే సమయంలో 'మిసెస్ అండ్ మిస్టర్' మూవీ తరఫు న్యాయవాది టెక్నికల్ గా ఇళయరాజా పిటీషన్ లోని ఓ తప్పును తెలిపారు. ఈ సినిమాకు దర్శకురాలైన వనితా విజయ్ కుమార్ పేరుని పిటిషన్ లో నిర్మాతగా పేర్కొన్నారని అన్నారు. నిజానికి ఈ సినిమాకు వనితా విజయ్ కుమార్ కుమార్తె జోవిక విజయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించింది. దర్శకత్వం వహించడంతో పాటు వనితా ఇందులో నాయికగా నటించింది. ఏదేమైనా ఇటీవల ఇళయరాజా తన పాటలను ముందస్తు అనుమతి లేకుండా వాడుకుంటే నిర్మొహమాటంగా కోర్టు కేసులు వేస్తున్నారు. ఆడియో కంపెనీలకు ఆ పాటలపై హక్కులు ఇచ్చినా... స్వరకర్తగా తనకున్న హక్కులపై ఇళయరాజా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అలా ఆయన ఇటీవల 'కూలీ, గుడ్ బ్యాడ్ అగ్లీ, మంజుమల్ బాయ్స్' చిత్రాల నిర్మాతలపై కేసులు పెట్టారు. తాజాగా 'మిసెస్ అండ్ మిస్టర్' మూవీ కేసులో సోనీ మ్యూజిక్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థను కూడా పార్టీగా చేర్చాల్సిందిగా కోర్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్ట్ 18న జరుగనుంది. మరి కోర్టు వీరందరి వాదనలు విని ఏం తీర్పు చెబుతుందో చూడాలి.
Also Read: Rajinikanth: పుసక్తంగా రజనీకాంత్ 'ఆత్మకథ'
Also Read: Saiyaara: రూ. 200 కోట్లు నాట్ అవుట్...