Mahavatar Narasimha: పాకిస్తాన్‌లో.. మహావతార్ నరసింహ ప్రభంజనం! ప్రహ్లాదుడి.. సొంత గడ్డపై భక్తి పారవశ్యం
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:14 PM
ఈ సినిమాకు భారీ హీరో లేరు, పెద్ద ప్రమోషన్ లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ యానిమేషన్ చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాకు భారీ హీరో లేరు, పెద్ద ప్రమోషన్ లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ యానిమేషన్ చిత్రంగా నిలిచింది. అంతకుమించి, ఇదిప్పుడు ఆస్కార్ రేసులో ఉంది!. అదే మహావతార్ నరసింహ (Mahavatar Narasimha). చిన్న సినిమాగా సైలెంట్‌గా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు అందని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన రోజు నుంచే దూసుకుపోతూ, థియేటర్లలోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యానిమేటెడ్ సినిమా కావడం, ఏ విధమైన భారీ ప్రమోషన్ లేకపోయిన కేవలం మౌత్‌టాక్‌తో ఈ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా రికార్డు స్థాయి వ్యూస్‌తో మరోసారి తన సత్తా చాటుకుంది.
ఇక్కడ విజయం అందుకున్న అనంతరం, విదేశాల్లో రిలీజ్ చేయగా అక్కడా అదే పరిస్థితి. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ను దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు. నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్భాగవతం ఆధారంగా సాగిన కథను ఆధునిక యానిమేషన్‌తో చూపించడం చిత్రానికి ప్రధాన ప్రత్యేకత. పురాణాల్లోని వైభవం, నరసింహ అవతారం యొక్క శక్తి–భావనలను గ్రాఫికల్‌గా అద్భుతంగా చూపించిందని ప్రేక్షకులు ప్రశంసించారు.
ఇక ఈ చిత్రం ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ పురస్కారాల్లో నామినేషన్‌కు అర్హత సాధించడం విశేషం. ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల్లో ‘మహావతార్ నరసింహ’ ఒకటిగా నిలిచింది. ఫైనల్ నామినేషన్స్ జనవరి 22న ప్రకటించనుండగా.. భారతీయ సినీ అభిమానులంతా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫైనల్ నామినేషన్‌లోకి చేరితే, ఆస్కార్‌లో నామినేషన్ పొందిన మొదటి భారతీయ యానిమేటెడ్ ఫిల్మ్‌గా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ రూపొందించిన ‘హోంబౌండ్’ ఇప్పటికే భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికై బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో పోటీ పడుతోంది.
ఇలా రెండు వేర్వేరు కేటగిరీల్లో భారత సినిమాలు ప్రపంచ వేదికపై బరిలో నిలవడం సినీ ప్రేమికులకు గర్వకారణం. తాజాగా ఈ సినిమాను పాకిస్థాన్ లో సైతం ప్రదర్శించారు. కరాచీలోని చారిత్రక స్వామి నారాయణ (Swaminarayan Mandir Karachi) దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా వందల సంఖ్యలో పాకిస్థాని హిందువులు తరలి వచ్చారు. వారంతా సినిమాను వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పాకిస్తాన్ లోని హిందూ సంస్కృతికి, భక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఇదిలాఉంటే.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. మన పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడి స్వస్థలం పాకిస్తాన్‌లోని ముల్తాన్ కావడం విశేషం. కాగా నరసింహావతారం జరిగింది, హిరణ్యకశ్యపుడని అంతమొందించి ప్రహ్లాదుడికి సాక్షాత్కారించింది ఇక్కడే అని.. అహబిలం కాదని ఇక్కడ చాలామంది అక్కడి అధారాలు సైతం చూపించడం గమనార్హం.