Vishal - Dhansika: తప్పకుండా ప్రేమ వివాహమే.. క్లారిటీ ఇచ్చిన హీరో
ABN, Publish Date - May 19 , 2025 | 04:17 PM
హీరో విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తమిళనాడులో ఓ వేదికపై తెలిపారు. దాంతో మరోసారి ఆయన పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది.
హీరో విశాల్ (Vishal) త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తమిళనాడులో ఓ వేదికపై తెలిపారు. దాంతో మరోసారి ఆయన పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన ఏడడుగులు వేయనున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారని త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై విశాల్, ధన్సిక (Dhansika) ఎవరూ స్పందించలేదు. విశాల్ పెళ్లి గురించి ఈ తరహా వార్తలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన వివాహంపై ఎన్నో వార్తలు వచ్చాయి. వరలక్ష్మీ, అభినయ వంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. ‘నడిగర్ సంఘం’ బిల్డింగ్ నిర్మాణం పూర్తైన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించారు. ఈక్రమంలోనే ఇటీవల బిల్డింగ్ నిర్మాణం పూర్తైంది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లి గురించి ప్రస్తావించారు. ‘‘త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది తప్పకుండా ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా’’ అని అన్నారు. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దైంది.