Venky Atluri: సూర్య సరసన కీర్తి సురేశ్‌

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:42 AM

సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో' మే 1న వస్తోంది. ఇప్పటికే ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో సూర్య ఓ మూవీలో నటిస్తున్నాడు. ఇక వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య చేసే మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్ అని తెలుస్తోంది.

ప్రముఖ తమిళ హీరో సూర్య (Suriya) సింప్లిఫై డెక్కన్ అధినేత జి.ఆర్. గోపీనాథ్‌ బయోపిక్ 'సూరారై పోట్రు' (Soorarai Pottru) లో నటించాడు. ఈ సినిమా తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' (Aaksam Nee Haddura) పేరుతో విడుదలైంది. దీనికి సుధ కొంగర (Sudha Kongara) దర్శకురాలు. ఈ మూవీ ఏకంగా జాతీయ స్థాయిలో ఐదు అవార్డులను గెలుచుకుంది. సూర్య, అతని సరసన నటించిన అపర్ణ బాల మురళి (Aparna Bala Murali), సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ (GV Prakash) జాతీయ అవార్డులను అందుకున్నారు. అలానే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులూ ఈ సినిమాకు దక్కాయి. ఆ తర్వాత సూర్య 'జై భీమ్' (Jai Bheem) సినిమాలో జస్టిస్ కె. చంద్రు జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చేశాడు. అది కూడా నటుడిగా సూర్యకు మంచి పేరే తెచ్చిపెట్టింది.


సూర్య సరసన కీర్తి సురేశ్‌

సూర్య తాజా చిత్రం 'రెట్రో' (Retro) మే 1న విడుదల కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దీనికి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. అలానే ఇప్పటికే ఆర్. జె. బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. అంతేకాదు... సూర్య కొత్త సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి ఇటీవల 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar) మూవీని తెరకెక్కించిన వెంకీ అట్లూరి (Venky Atluri) సినిమా! సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీనిని నిర్మిస్తాడని, తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకునే ఈ సినిమాలో సూర్య నటిస్తున్నాడని తెలుస్తోంది. మారుతీ కార్లు తయారైన కాలానికి చెందిన ఈ సినిమా కూడా బయోపిక్ అనే అంటున్నారు. అయితే అది ఎవరిదనేది ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. ఈ కథకు తగ్గట్టుగా దీనికి '796 సీసీ' అనే పేరు పెడుతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే భాగశ్రీ బోర్సే (Bhagyasri Borse) నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కథను తాజాగా కీర్తి సురేశ్‌ కు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాడని, ఆమె తన ఆమోదాన్ని తెలిపిందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్థానం ఉందని, సో... ఇద్దరూ నటించే ఆస్కారం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా... ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఓపిక పట్టాల్సిందే.

Also Read: Ram Charan: 'గేమ్ ఛేంజర్' పై కార్తిక్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 24 , 2025 | 11:42 AM