Tollywood: ఒకే రోజున నంబర్ మూవీస్!
ABN, Publish Date - May 03 , 2025 | 05:08 PM
కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకున్న చిత్రాలు '23', 'లెవన్'. ఈ రెండు సినిమాలూ ఒకే రోజున జనం ముందుకు రాబోతున్నాయి.
తెలుగులో పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ బేస్డ్ మూవీస్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే వాటిలో పాపులర్ స్టార్ కాస్ట్ ఉండని కారణంగా అవి జనాలను రీచ్ కావడంలో ఫెయిల్ అవుతున్నాయి. అయినా కొందరు దర్శక నిర్మాతలు తమ కున్న బడ్జెట్ లోనే నచ్చిన కథను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు... ప్రజలను ఆలోచింప చేసే సినిమాలు తీయడానికి వారు వెనకాడటం లేదు కూడా. ఆ కోవకు చెందిన సినిమానే '23'. రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కొన్ని సంఘటనలను బేస్ గా తీసుకుని ఈ కథను రాసుకున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని పైకి చెప్పుకున్నా... కొందరి దృష్టిలో అది ఎక్కువ సమానం అనే మాట అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. అలాంటి ఓ సంఘటనను బేస్ చేసుకుని... 'మల్లేశం' (Mallesam) ఫేమ్ రాజ్ ఆర్ ఈ మూవీని తెరకెక్కించారు. చిలకలూరిపేట బస్సు దహనం కేసు నేపథ్యంలో '23' సినిమా రూపుదిద్దుకుంది. చట్టంలోని లొసుగుల కారణంగా దశాబ్దాలు గడిచినా... ఇంకా జైలులోనే మగ్గుతున్న నేరస్థులకు సంబంధించిన అంశాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చర్చించారు.
తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించిన '23' సినిమాను వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. దీనిని స్టూడియో 99 నిర్మించింది. రానా దగ్గుబాటి (Rana Daggubati) కి చెందిన స్పిరిట్ మీడియా ఈ మూవీని డిస్ట్రిబ్యూషన్ చేయబోతోంది. ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం చంద్రబోస్ (Chandrabose) రాయగా, మార్క్ కె రాబిన్ (Mark K Robin) స్వరపర్చిన 'చెరసాల' అనే గీతాన్ని మే 5న విడుదల చేయబోతున్నారు. దీన్ని చిన్మయి (Chinmayi), కపిల్ కపిలన్ పాడారు. '23' సినిమా మే 16న జనం ముందుకు రాబోతోంది.
విశేషం ఏమంటే... మే 16వ తేదీనే నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించిన 'లెవన్' మూవీ సైతం విడుదల అవుతోంది. సుందర్ సి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన లోకేష్ అజ్ల్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అజ్మల్ ఖాన్, రేయా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో శశాంక్, ఆడుకాలం నరేన్, రేయా హరి, అభిరామి, రవివర్మ, కిరీటీ దామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డి. ఇమాన్ సంగీతం అందించారు. '11' కూడా '23' తరహాలో కంటెంట్ బేస్డ్ మూవీనే. నంబర్స్ నే టైటిల్ గా పెట్టుకున్న ఈ రెండు సినిమాలు ఒకే రోజున... మే 16న విడుదల కావడం కాకతాళీయం!
Also Read: Venkatesh - Sailesh: వెంకీతో మరో సినిమాకు శ్రీకారం..
Also Read: Vijay Devarakonda: అందరి వేలు అతనివైపే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి