E Valayam Malayalam Movie : సెల్ కు అడిక్ట్ అయితే ఇక అంతే...

ABN , Publish Date - Jul 19 , 2025 | 03:50 PM

ఇటీవల మలయాళంలో విడుదలైన 'ఈ వలయం' సినిమాకు యువత నుండి చక్కని స్పందన లభిస్తోంది. దీంతో కేరళ ప్రభుత్వం దీనికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చింది. సెల్ ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందులను ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు దర్శకురాలు రేవతి ఎస్ వర్మ.

E Valayam Malayalam Movie

సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. ప్రజలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పాల్సిన సామాజిక బాధ్యత కూడా సినిమా మీద ఉంటుంది. అప్పుడే ఆ కళకు సార్థకత చేకూరుతుంది. అయితే సినిమా విఫణి వీధిలోకి అడుగుపెట్టిన తర్వాత అది కూడా ఓ వ్యాపార వస్తువుగా మారిపోయింది. సినిమా ద్వారా వచ్చే లాభాల మీదనే నిర్మాతలు దృష్టి పెడుతున్నారు తప్పితే... ఫక్తు వాణిజ్య చిత్రాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. ఇలాంటి రోజుల్లో కూడా కొన్ని సెన్సిబుల్ మూవీస్ వివిధ భారతీయ భాషల్లో వస్తున్నాయి. అలా మలయాళంలో రూపుదిద్దుకున్నదే 'ఈ వలయం' (E Valayam). ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.


యువత సెల్ ఫోన్ కు బానిస అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో 'ఈ వలయం' మూవీలో చూపించారు. సిగరెట్ కో, మందుకో అడిక్ట్ అయినట్టుగా ఇవాళ యువత సెల్ కు అడిక్ట్ అవుతున్న మాట వాస్తవం. నిజం చెప్పాలంటే యువత మాత్రమే కాదు... అందరూ సెల్ లో బందీలు అయిపోతున్నారు. అయితే అది తీవ్ర రూపం దాల్చడం వల్ల ఓ కుటుంబం మొత్తం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని దర్శకురాలు రేవతి ఎస్ వర్మ (Revathi S Varma) 'ఈ వలయం'లో చూపించారు. సెల్ ఫోన్ ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని అమ్మాయిగా యాష్లీ ఉష నటించింది. ఆమె తండ్రిగా ప్రముఖ నటుడు, స్క్రీన్ ప్లే రైటర్ రెంజీ ఫణిక్కర్ నటించగా, ఆమె తల్లి పాత్రను డాక్టర్ ముత్తుమణి పోషించారు.

నోమోఫోబియాకు గురైన మనుషుల ప్రవర్తనను తెలియచేస్తూనే అలాంటి వారిని ఎలా డీల్ చేయాలో 'ఈ వలయం' సినిమాలో చూపించారు. యువతలో ముఖ్యంగా విద్యార్థులలో చైతన్యం కలిగించే సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టారు. విశేషం ఏమంటే కేరళ ప్రభుత్వం ఈ చిత్రానికి ఎంటర్ టైన్ మెంట్ టాక్స్ రద్దు చేసింది. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, త్వరలోనే ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని నిర్మాత జోబీ జాయ్ తెలిపారు.

Also Read: Shah Rukh Khan: షూటింగ్‌లో డూప్ లేకుండా స్టంట్స్‌.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ షారుఖ్ ఖాన్

Also Read: Hari Hara Veera Mallu: డిప్యూటీ సీఎం సినిమా అయినా అందరితో సమానమే

Updated Date - Jul 19 , 2025 | 03:51 PM