Dulquer- Siva karthikeyan: మరోమారు... ఆ ఇద్దరు
ABN , Publish Date - Jun 30 , 2025 | 06:25 PM
ఒకరు మల్లూవుడ్ స్టార్ - మరొకరు కోలీవుడ్ హీరో...ఇద్దరూ తెలుగువారికి తెలిసినవారే... గత యేడాది ఒకే రోజున ఢీ కొన్న ఆ ఇద్దరు యంగ్ హీరోస్ - మరోమారు ముఖాముఖి పోటికి సిద్ధమవుతున్నారు.
మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తో తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) మరోమారు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతున్నారు... ఇంతకు ముందు వీరిద్దరూ గత సంవత్సరం బరిలో ఢీ కొన్నారు... నిరుడు అక్టోబర్ 31వ తేదీన దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar) పాన్ ఇండియా మూవీగా వచ్చింది... అదే రోజున శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన 'అమరన్' (Amaran) తెలుగునాట అనువాద రూపంలో రిలీజయింది... ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ లో రెండూ సక్సెస్ సాధించాయి... అయితే వసూళ్ళ పరంగా కార్తికేయన్ 'అమరన్' దే పై చేయిగా నిలచింది... ఇప్పుడు మరోమారు శివకార్తికేయన్, దుల్కర్ సల్మాన్ పోటీకి సై అంటూ ఉండడం విశేషంగా మారింది.
ఈ సారి దుల్కర్, శివ కార్తికేయన్ నటించిన సినిమాలు సెప్టెంబర్ 5న విడుదలకు రెడీ అవుతున్నాయి. శివ కార్తికేయన్ , ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ 'మదరాసి' (Madarasi)బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. అదే రోజు దుల్కర్, సెల్వమణి సెల్వరాజ్ కలయికలో 'కాంత' (kaantha)కూడా వెలుగు చూడనుందని తెలుస్తోంది. 1950 మద్రాస్ బ్యాక్డ్రాప్లో ' కాంత' తెరకెక్కినట్టు సమాచారం.. ఇక చెన్నైలో జరిగే ఒక యథార్థ సంఘటన తో 'మదరాసి' రాబోతున్నట్లు వినికిడి. పోయిన ఏడాది సాగిన దుల్కర్, కార్తికేయన్ పోటీ దృష్ట్యా ఇప్పుడు "కాంత, మదరాసి" చిత్రాలపై కూడా మూవీ లవర్స్ ఫోకస్ పెట్టారు...
ఒకే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న "కాంత, మదరాసీ" చిత్రాలకు తెలుగునాట పెద్దగా స్క్రీన్ కౌంట్ దొరకదని వినిపిస్తోంది. ఎందుకంటే... అదే సమయంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'మాస్ జతర' ఆగస్టు 27న విడుదల కానుంది. కుర్ర హీరో తేజ సజ్జా నటించిన పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' కూడా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో దుల్కర్, కార్తికేయన్ సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది... దుల్కర్, శివ కార్తికేయన్ ఇద్దరికీ తెలుగునేలపై కూడా మంచి ఫాలోయింగ్ ఉంది... ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వీరికి సరైన సినిమా హాళ్ళు దొరక్కపోతే బాక్సాఫీస్ వార్ లో ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.