Kaantha Teaser: దుల్కర్ 'కాంత'.. టీజర్ భలే కొత్తగా ఉందే
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:33 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Kaantha Teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తెలుగువారికి మాత్రం తన నటనతోనే దగ్గరయ్యాడు. మహానటి సినిమాలో ఎంజీఆర్ గా కనిపించినా.. సీతారామంలో రామ్ గా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. ఇక ఆ తరువాత లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ప్రస్తుతం దుల్కర్ నటిస్తున్న చిత్రాల్లో కాంత(Kaantha) ఒకటి.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం కాంత. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు దుల్కర్ పుట్టినరోజు కావడంతో.. కాంత టీజర్ ను రిలీజ్ చేసి తమ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చారు.
కాంత టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దుల్కర్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది. కాంత సినిమా 60 వ దశకంలో జరిగిన కథగా తెలుస్తోంది. ఒక హీరో, డైరెక్టర్ కు మధ్య వచ్చిన ఈగో క్లాష్.. వారిని ఎక్కడ వరకు తీసుకెళ్లింది అనేది కథగా చూపించారు. సముద్రఖని డైరెక్టర్ గా కనిపించగా.. దుల్కర్ హీరోగా కనిపిస్తున్నాడు. హీరో ఒకటి అంటే.. డైరెక్టర్ ఇంకొకటి అనడం, వారిద్దరి మధ్య గొడవలు లాంటి సీన్స్ చూపించారు.
హీరోకు నటన నేర్పి.. స్టార్ గా మార్చిన డైరెక్టర్ ను తీసిపడేయడం.. చివరకు ఆయన పెట్టిన టైటిల్ శాంతను కాంతగా మార్చడం చూపించారు. అసలుఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏంటి.. ? ఎందుకు అన్ని గొడవలు పడినా సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. వీరి మధ్యలో హీరోయిన్ పాత్ర ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి పాత్రలు అటు దుల్కర్ కు కానీ, ఇటు సముద్రఖనికి కానీ కొత్తేమి కాదు. ముఖ్యంగా దుల్కర్ మెథడ్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. ఇక భాగ్యశ్రీ కూడా గ్లామర్ కాకుండా నటనతోనే ఈసారి మెప్పించేలా కనిపిస్తుంది. సెప్టెంబర్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.